యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి జరిగి 48 గంటలు గడవకముందే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నవ వరుడుతోపాటు, అతని తల్లిదండ్రులు, మేనత్త మృత్యువాత పడ్డారు. పోచంపల్లి మండలం ముక్తాపురంలో ఈ దారుణ ఘటన జరిగింది. విద్యుత్ షాక్ తగలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా నివాసం ఉండే చిన్నం ప్రవీణ్‌కు ఈ నెల 19న వివాహం జరిగింది. పెళ్లై రెండు రోజులు గడవక ముందే పెళ్లింట ఈ విషాదం సంభవించింది.
పందిట్లో విద్యుత్తు బల్బులకు వేసిన తీగ ఇనుప స్తంభానికి తగిలించారు. అదే ఇనుప స్తంభానికి దుస్తులు ఆరేయడానికి తీగను కట్టారు. ప్రమాదవశాత్తు విద్యుత్తు స్తంభం నుంచి తీగకు విద్యుత్తు సరఫరా అయ్యింది. పెళ్లికుమారుడి తల్లి అదే తీగపై దుస్తులు ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు విద్యుదాఘాతానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.