AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ఎండాకాలం పంటలు వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతంగానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. రైతులు ఈసారి ఎండాకాలం పంటలు మానుకోవాలని కోరారు. ఒక సీజన్‌ పంటను వాయిదా వేసుకోవాలని.. ఎవరో చెప్పిన మాటలను రైతులు పట్టించుకోవద్దన్నారు. నీటికొరతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: ఎండాకాలం పంటలు వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Cm Revanth Reddy Urges Telangana Farmers Due To Water Shortage
Anand T
|

Updated on: Oct 15, 2026 | 8:48 PM

Share

ఎల్‌నినో ఒక తీవ్రమైన ప్రకృతి విపత్తుగా మారి ఈ ఏడాది ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, గతంలో కరోనా సంక్షోభం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భూమిపై నివసించే మనుషులు, జంతువులు సహా ప్రతి జీవరాశిపై వాతావరణ మార్పుల ప్రభావం పడుతోందన్నారు. 1950 తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎల్‌నినో వచ్చినప్పటికీ, ఈసారి అది మరింత తీవ్రమై సూపర్ ఎల్‌నినోగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు, రైతులు, పశుసంపదను కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు.

అక్టోబర్‌లోనే 38 డిగ్రీల ఎండలు..

ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి పంటకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోందన్నారు. సాధారణంగా మార్చి నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు అక్టోబర్‌లోనే నమోదవుతున్నాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. నీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీటి సమస్యతో పాటే విద్యుత్ సమస్య కూడా తీవ్రంగా మారుతోందని తెలిపారు.

రికార్డు స్థాయి డిమాండ్..

తెలంగాణలో ఉన్న 30 లక్షల పంప్‌సెట్లకు విద్యుత్ అవసరం పెరగడంతో అక్టోబర్ నెలలోనే కరెంట్ వినియోగం భారీగా పెరిగిందని సీఎం వివరించారు. సాధారణ అవసరాలకు అదనంగా మరో 5 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగిందన్నారు. 15 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేసిన పరిస్థితుల్లో, డిమాండ్ ఏకంగా 20 వేల మెగావాట్లకు పైగా పెరిగిందని.. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూ లేనంత విద్యుత్ వినియోగం నమోదైందని తెలిపారు.

ఈ గడిచిన దశాబ్ధి కాలంలో విద్యుత్ వినియోగం సుమారు 14 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగిందని గుర్తుచేశారు. విద్యుత్ ఉత్పత్తి కంటే అవసరాలు భారీగా పెరిగినా.. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడం పెను సవాల్‌గా మారినప్పటికీ, రైతులకు అంతరాయం లేకుండా కరెంట్ అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించారు.

పడిపోయిన రిజర్వాయర్ నిల్వలు..

రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 23 శాతం తక్కువగా నమోదైందని, దీంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని సీఎం అన్నారు. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు సుమారు 70 శాతం తక్కువగా ఉన్నాయన్నారు. యాసంగి పంట ప్రారంభానికి ముందే నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. వేలాది గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు పట్టణాల్లో పెరుగుతున్న అవసరాలను తీర్చాల్సి ఉందని.. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ అవసరాల మధ్య సమతుల్యత పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు.

రాబోయే 8 నెలలు అత్యంత కీలకం

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎదురయ్యే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కరోనా సంక్షోభం తరహాలోనే అంతా సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. జూలై వరకు ఉండే రాబోయే ఎనిమిది నెలలు అత్యంత కీలకమని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని ఆచితూచి వినియోగించుకోవాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగునీరు, తాగునీటి అవసరాలను సమన్వయం చేసుకుంటూ.. రైతులు వేసిన పంటలు చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పంట నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైతులు మనోధైర్యం కోల్పోవద్దు..

దేశంలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా రైతాంగమే ప్రజలకు అండగా నిలిచింది. కరువు పరిస్థితుల్లోనూ రక్తం ధారపోసి పంటలు పండించి దేశానికి ఆహారం అందించింది. ఈ క్లిష్ట సమయంలో రైతులెవరూ మనోధైర్యం కోల్పోవద్దు.. రైతులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో విద్యుత్ దొరకని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పంటలు చేతికొచ్చే వరకు రైతులకు కరెంట్ సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

అదే సమయంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకుంటూ రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నీరు, విద్యుత్ పొదుపుపై గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తేవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోరామని ముఖ్యమంత్రి తెలిపారు. కరువు ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు తెలంగాణకు తక్షణమే రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అదనపు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us