Alert: ఓరి మీ దుంపల తెగ.. ఏకంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కే ఎసరు

| Edited By: Ram Naramaneni

Nov 28, 2024 | 8:09 PM

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీపై కేసులు నమోదయ్యాయి.. సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయడానికి వస్తున్నారంటూ బెదిరిస్తున్నారు. మీపై ఉన్న కేసులు మాఫీ కావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ .. బ్యాంకు స్టేట్మెంట్స్, ఓటీపీలు రాబట్టి... అకౌంట్‌లో ఉన్న డబ్బును కొట్టేస్తున్నారు. అయితే ఇలాంటి క్రైమ్స్‌ చేసే కంప్లైంట్ చేసే 1930 నంబర్‌ను కూడా వాళ్లు వినియోగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Alert: ఓరి మీ దుంపల తెగ.. ఏకంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కే ఎసరు
Cyber Crime Helpline
Follow us on

సైబర్ నేరస్తులు రోజురోజుకి పెట్రేగిపోతూ సొమ్ము కాజేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. విభిన్న మార్గాల్లో జనాల్ని గుళ్ల చేస్తున్నారు. అలాంటి సైబర్ నేరగాళ్లకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1930 లాంటి టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతోంది. వెనువెంటనే కంప్లైంట్స్ తీసుకోవడం.. నగదు బదిలీ అయిన అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేయడం వంటివి ఈ నంబర్ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది.

సాధారణంగా సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి కొన్ని తెలిసిన పద్ధతులను అనుసరిస్తారు. ఒకటి కొరియర్ ఫ్రాడ్.. మరొకటి డిజిటల్ అరెస్ట్ ఈ రెండు స్కీం లను ఉపయోగించి రీసెంట్‌గా ఎన్నో కోట్ల రూపాయలు దోచుకున్నారు. తాజాగా సైబర్ ఫ్రాడ్‌పై కంప్లైంట్ చేసే 1930ను కూడా తమకు అనుగుణంగా వాడుతున్నారు కేటుగాళ్లు. ముందుగా మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందంటూ నమ్మిస్తారు. ఆ పార్శిల్‌లో అనుమాన్పద వస్తువులు ఉన్నాయని కట్టు కథ అల్లుతారు. డ్రగ్స్, వెపన్స్, పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని భయపెట్టి మభ్యపెడతారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు, వారి నేర ధోరణిపై ముందుగానే అవగాహన ఉంటే వెంటనే బాధితుడు అలెర్ట్ అవుతాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటే.. ఆ అవసరం మీకు లేదు మేమే 1930 కు కాల్ కలుపుతాం అంటూ.. వారే పోలీసుల్లా మాట్లాడుతూ సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల ఇలాంటి కంప్లైంట్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు.

కాగా డిజిటల్ అరెస్ట్‌ల రూపంలో ఎన్నో వందల కోట్ల రూపాయాలు కాజేసారు. డిజిటల్ అరెస్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం సైతం అవగాహన కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. డిజిటల్ అరెస్టుల రూపంలో బాధితులుగా ఉన్నవారు దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ యూనిఫామ్ ధరించి ముంబై పోలీస్ లోగోని వెనకాల పెట్టి కేవలం స్కైప్ కాల్‌లో మాట్లాడి బాధితుడుని మాటల్లో పెట్టి ఏదో పెద్ద నేరం జరిగిందని వారిని నమ్మించి వారికి సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నారు సైబర్ నేరస్తులు. ఇలాంటి మోసాలు చేసినవారిని ఇతర రాష్ట్రానికి వెళ్లి అనేకమంది నిందితులను అరెస్ట్ చేసి తెలంగాణకు తీసుకొస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి