‘డిజిటల్ అరెస్టు’ ముప్పు నుండి అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలను హెచ్చరించారు. మోసపూరిత యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతూ.. అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ‘ఫేస్‌బుక్’, ‘ఇన్‌స్టాగ్రామ్’, ‘వాట్సాప్’, టెలిగ్రామ్ వంటి సామాజిక వేదికల ద్వారా నిర్వహిస్తున్నారు. పిగ్ బచ్చరింగ్ స్కామ్‌లుగా ప్రసిద్ధి చెందిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, నకిలీ వెబ్‌సైట్‌లు, వాట్సాప్ గ్రూపులను అధిక లాభాల ఆశజూపి ప్రజలను ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఈ మాయాగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు సమర్పించకున్నారు.
74 ఏళ్ల రిటైర్డ్ మహిళను స్కామర్లు వాట్సాప్ ద్వారా టార్గెట్ చేశారు. ఆమెకు అంధేరీ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నట్లు నమ్మబలికారు. ఆమె పేరుపై FIR క్రైమ్ నెంబర్ MH-1045/0924 నమోదైందని తెలిపారు. ఆమె మొబైల్ నంబర్‌కు వరుసగా మెసెజ్‌లు పంపారు. CBI, RBI నుండి నకిలీ లేఖలు పంపించి, మనీల్యాండరింగ్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆమెతోపాటు నరేష్ గోయల్, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ పై విదేశీ మారకం ఉల్లంఘనలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని నమ్మబలికారు కేటుగాళ్లు.
ఈ క్రమంలోనే ఆమె బ్యాంక్ వివరాలు వెల్లడించమని డిమాండ్ చేశారు. లేదంటే ఆమె ఖాతాలు మూసివేస్తామని, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే, ఆమెను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన నిధులను డిపాజిట్ చేయమని సూచించారు. స్కామర్లు తమను ఒక రహాస్య ఏజెన్సీగా చూపించి, మాట్లాడుతున్న విషయం బయటపెట్టవద్దని ఆదేశించారు. ఇందుకోసం కేటుగాళ్లు చూపించిన ఖాతాలోకి డబ్బులు బదిలీ చేశారు. ఒత్తిడిలో ఆమె తన ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఉపసంహరించి, రూ. 37.90 లక్షలను స్కామర్ ఖాతాలో RTGS ద్వారా డిపాజిట్ చేశారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ అరెస్టులు, సైబర్ క్రైమ్స్‌పై హైలెవెల్ కమిటీ వేసింది. ఒక్కో క్రైమ్‌ని కచ్చితంగా ఛేదించేలా ఆదేశాలిచ్చింది. కేవలం డిజిటల్ అరెస్టుల రూపంలోనే కాదు.. డిజిటల్ ట్రేడింగ్, డేటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరు చెప్పి కోట్లకు కోట్లు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరేం అడిగినా సమాచారం ఇవ్వొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్, పాన్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్ డిటైల్స్‌తో పాటు ఓటీపీలు చెప్పొద్దంటున్నారు. మెసేజ్‌లు, వాట్సాప్‌లలో వచ్చే లింక్‌లను క్లిక్ చేయడం, తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చేయొద్దని కోరుతున్నారు. ఒకవేళ మోసపోతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ 1930కి కంప్లైంట్ చేస్తే పోయిన డబ్బు రాబట్టుకోవచ్చు. సో, ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని చట్టాలు చేసినా.. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మాత్రం చేయగలిగిందేం లేదు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..