మహిళా కండక్టర్ మృతి ఘటనతో TGSRTC కీలక నిర్ణయం.. ఇకపై బస్సుల్లో కొత్త రూల్ షురూ!
మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి ఘటన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. కదులుతున్న బస్సుల నుంచి ప్రమాదాలు జరగకుండా ప్యాసింజర్ డోర్లు ఉన్న అన్ని బస్సుల్లో ప్రయాణ సమయంలో తలుపులు తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్టీసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అన్ని డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు సూచనలు జారీ చేసింది. బస్సుల డోర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసి, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భద్రతకు మరింత ప్రాధాన్యత లభించనుంది..

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు, విధులు నిర్వహించే సిబ్బంది భద్రత విషయంలో TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. కదులుతున్న బస్సు నుంచి ప్రయాణికురాలు తోసేయడంతో తీవ్రంగా గాయపడి మరణించిన మహిళా కండక్టర్ ఘటన నేపథ్యంలో కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్యాసింజర్ డోర్లు ఉన్న బస్సులు ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా తలుపులు మూసి ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన మహిళా కండక్టర్ మృతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల గుండ్ల ప్రవళిక విధుల్లో ఉండగా ప్రయాణికురాలితో జరిగిన వివాదం విషాదానికి దారితీసింది. ఈ ఘటన అక్టోబర్ 25న అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో చోటుచేసుకుంది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో ప్రవళిక విధులు నిర్వహిస్తున్నారు.
అదే బస్సులో ప్రయాణిస్తున్న బానోత్ మౌనిక తన కుమారుడి టికెట్ విషయంలో ప్రవళికతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. రూ.100 నోటుకు చిల్లర తిరిగి ఇచ్చే విషయంలోనూ ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికురాలు కదులుతున్న బస్సు నుంచి ప్రవళికను బయటకు తోసేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రవళిక మృతి చెందారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక చర్యలు చేపట్టింది. ప్యాసింజర్ డోర్లు ఉన్న బస్సులు కదులుతున్న సమయంలో వాటిని తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్టీసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అన్ని డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు సూచనలు జారీ చేసింది. తమ పరిధిలోని బస్సుల్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన తలుపులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించింది.
అంతేకాకుండా బస్సులు ప్రయాణంలో ఉన్నప్పుడు తలుపులు తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్షేత్రస్థాయి అధికారులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. మహిళా కండక్టర్ ప్రవళిక మృతి ఘటన నేపథ్యంలో TGSRTC తీసుకున్న ఈ నిర్ణయం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై మరింత దృష్టి పెట్టేలా చేసింది. బస్సు తలుపులు సక్రమంగా పనిచేస్తున్నాయా? ప్రయాణ సమయంలో అవి మూసి ఉన్నాయా? అనే అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.




