AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. ముచ్చింతల్‌లో ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు

Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Mahotsavams: చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు నవంబర్ 8 నుంచి 12 వరకు ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో వైభవంగా జరగనున్నాయి. ఐదు రోజుల పాటు సుందరకాండ పారాయణం, ఆచార్య వైభవం, మంగళ తరంగిణి, విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు దేశసేవ, సమాజ సేవకు అంకితమైన వారికి పురస్కారాలు, సన్మానాలు నిర్వహించనున్నారు.

చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు.. ముచ్చింతల్‌లో ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు
Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Mahotsavams
Rajashekher G
|

Updated on: Nov 07, 2026 | 3:46 PM

Share

Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Mahotsavams: శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ 70వ తిరునక్షత్ర మహోత్సవాల(జన్మదిన వేడుకలను)ను పురస్కరించుకుని ‘యతీంద్ర సప్తతి’ పేరిట ఐదు రోజుల పాటు ఘనమైన ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించనున్నారు. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌ సమీపంలోని షంషాబాద్‌ ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమంలో ఈ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, శిష్యులు, ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

మహోత్సవాలకు ముందస్తుగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు

యతీంద్ర సప్తతి వేడుకలకు ముందు నుంచే చిన్న జీయర్ స్వామిజీ భక్తులు దేశ, విదేశాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది ఆలయాలు, భక్తుల ఇళ్లతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలోని శ్రీ సాకేతరామ ఆలయం నుంచి వందలాది కలశాలను ఆయా ప్రాంతాలకు పంపించి, భక్తులు నిర్వహించిన ప్రార్థనల్లో వాటిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ కలశాలన్నీ తిరిగి ముచ్చింతల్‌కు చేరుకున్నాయి. నవంబర్ 12న శ్రీరాముడికి నిర్వహించే ఏకోత్తర సహస్ర కలశాభిషేకంలో ఈ కలశాలను వినియోగించనున్నారు.

నవంబర్ 8.. పండితులకు జీయర్ పురస్కారాలు

మహోత్సవాల తొలిరోజైన నవంబర్ 8న వేద, సంస్కృత పండితులను సత్కరించనున్నారు. ఈ సందర్భంగా 36వ జీయర్ పురస్కారాన్ని మచిలీపట్నానికి చెందిన శ్రీమాన్ గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్యుల వారికి అందజేయనున్నారు. వేదాలు, ద్రావిడ ప్రబంధాల్లో విశేష పాండిత్యం కలిగిన ఆయన ప్రస్తుతం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అథర్వణ వేద పండితులుగా సేవలందిస్తున్నారు. అలాగే తమిళనాడుకు చెందిన శ్రీమాన్ ఎన్. మకరభూషణం అయ్యంగార్కు 37వ జీయర్ పురస్కారం అందజేయనున్నారు. జైమినీ సామవేదంలో ఆయనకు విశేష ప్రావీణ్యం ఉంది.

ఇక పలు సంస్కృత విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌గా సేవలందించిన ఆచార్య కందాల వెంకట రామకృష్ణమాచార్యులుకు 3వ విద్వన్మణి పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 50 మందికి పైగా విద్యార్థులు పీహెచ్‌డీలు పూర్తి చేయడం విశేషం.

నవంబర్ 9.. సుందరకాండ పారాయణం, ఆచార్య వైభవం

అమావాస్య సందర్భంగా నవంబర్ 9న తెల్లవారుజామున 5 గంటలకు సుందరకాండ పారాయణం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కార్యక్రమానికి మరింత ప్రత్యేకత ఉంది. శ్రీ ఆంజనేయస్వామికి లక్ష వడలు, లక్ష కొబ్బరికాయలను సమర్పించనున్నారు. అదే రోజు సాయంత్రం ‘ఆచార్య వైభవం’ కార్యక్రమం నిర్వహిస్తారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని సమానత్వ విగ్రహానికి ఉన్న 108 మెట్లకు ప్రతీకగా 108 శ్లోకాలను సమర్పించనున్నారు. ప్రతి మెట్టు చిన్న జీయర్ స్వామిజీ ఆధ్యాత్మిక ప్రస్థానంలోని ఒక ప్రత్యేక ఘట్టాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

నవంబర్ 10.. మంగళ తరంగిణి

నవంబర్ 10న ‘మంగళ తరంగిణి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో వేలాది మంది భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ నరసింహ స్వామి ప్రార్థన నిర్వహించనున్నారు. ఈ సామూహిక పారాయణంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననుండటంతో, కార్యక్రమం కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంతో నిర్వహించనున్నారు.

నవంబర్ 11.. సమతా పురస్కారం, మాతృసవనం

చిన్న జీయర్ స్వామిజీ దేశం, సమాజం పట్ల చూపుతున్న సేవాభావానికి అనుగుణంగా నవంబర్ 11న సమతా పురస్కారాలు అందజేయనున్నారు. దేశ రక్షణ, పరిశోధన, ధైర్యసాహసాలు తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 70 మంది ప్రముఖులను సత్కరించనున్నారు. వీరిలో ఎక్కువ మంది రక్షణ రంగం, రక్షణ పరిశోధనా సంస్థలకు చెందినవారు. అదే రోజు సమాజ సేవలో విశేష కృషి చేసిన వివిధ రంగాలకు చెందిన 70 మంది మహిళా ప్రతిభావంతులను ‘మాతృసవనం’ కార్యక్రమం ద్వారా సత్కరించనున్నారు.

నవంబర్ 12.. శ్రీరాముడికి ఏకోత్తర సహస్ర కలశాభిషేకం

ఐదు రోజుల మహోత్సవాలకు నవంబర్ 12న అత్యంత వైభవంగా ముగింపు పలకనున్నారు. ఈ సందర్భంగా ముచ్చింతల్‌లోని శ్రీ సాకేతరామ ఆలయంలో శ్రీరామచంద్రుడికి ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. దేశ విదేశాల్లోని భక్తుల ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ముచ్చింతల్‌కు చేరుకున్న కలశాలతోనే ఈ పవిత్ర అభిషేకాన్ని నిర్వహించనుండటం ఈ వేడుకకు ప్రత్యేకతను తీసుకొస్తోంది.

భక్తులకు ఆహ్వానం

చిన్న జీయర్ స్వామిజీ 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు, శ్రేయోభిలాషులు, ఆధ్యాత్మిక అభిమానులు పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. భగవద్ రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని సమాజంలో మరింత విస్తరించేలా ఈ వేడుకలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

వేదిక: జీయర్ ఆశ్రమం, ముచ్చింతల్, షంషాబాద్‌, హైదరాబాద్ తేదీలు: నవంబర్ 8 నుంచి 12, 2026 ఆయోజనం: జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ, ముచ్చింతల్.

వీడియో చూడండి..

Follow Us