Yadadri Thermal Power Plant: క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ తప్పదంటున్న కేంద్రం.. NGTలో పిటిషన్ వేసిన జెన్‌కో

| Edited By: Balaraju Goud

Dec 12, 2023 | 4:43 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ ప్లాంట్ నిర్మాణంతో తలెత్తే పర్యావరణ సమస్యలపై గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది

Yadadri Thermal Power Plant: క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ తప్పదంటున్న కేంద్రం.. NGTలో పిటిషన్ వేసిన జెన్‌కో
Yadadri Thermal Powe Plant
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ ప్లాంట్ నిర్మాణంతో తలెత్తే పర్యావరణ సమస్యలపై గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలంటూ తెలంగాణ జెన్‌కో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT)ని ఆశ్రయించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ విచారణ జరిపి తీర్పు ఇచ్చే వరకు పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. దీంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతి జారీ అంశం చిక్కుముడి వీడడం లేదు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసి, మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ (YTPS) నిర్మాణాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్‌కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లకు జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. అదే ఏడాది అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL)కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది.

సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా మారనుంది. విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్ నుంచి తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపు లైన్ ఏర్పాటు పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ కూడా నిర్మిస్తున్నారు. రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు సిద్దం చేశారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించిన పనులు 90 శాతానికి పైగా పూర్తి చేశారు.

ఈ నేథ్యంలో YTPSతో వెలువడే కాలుష్యం వల్ల నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడుతుందని, కేంద్రం జారీచేసిన ఈసీని రద్దు చేయాలంటూ ముంబైకి చెందిన కన్సర్వేషన్ యాక్షన్ ట్రస్ట్, విశాఖకు చెందిన సమత అనే స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీలో కేసులు వేశాయి. దీంతో ఎన్జీటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని నిలిపివేసింది. విచారణ జరిపిన ఎన్జీటీ, ప్లాంట్ వల్ల ఆ ప్రాంతంలో ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) జారీ చేయాలని గత అక్టోబర్ లో కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది.

అయితే, నిర్దేశిత 9 నెలల గడువు గత జూన్‌ 30తో ముగిసినా, కేంద్ర పర్యావరణ శాఖ టీఓఆర్‌ను జారీ చేయలేదు. టీఓఆర్‌ జారీ చేయాలని తెలంగాణ జెన్‌కో పలుమార్లు పర్యావరణ శాఖకు లేఖ రాసినా స్పందించలేదు. టీఓఆర్‌ రాకుండా ప్లాంట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి వీల్లేదని గతంలో ట్రైబ్యునల్‌ ఉత్తర్వులిచ్చింది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు అదనంగా దాటడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది.

టిఓఆర్‌తో సంబంధం లేకుండా పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని జెన్‌కో ఎన్జీటీలో పిటిషన్ వేసింది. డిసెంబర్ లోగా YTPS లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని జెన్‌కో పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ జారీకి ‘టీఓఆర్‌’ను నిర్దేశిస్తూ నివేదిక పంపాలని జెన్‌కోను కేంద్ర పర్యావరణశాఖ ఆదేశించింది. యాదాద్రి ప్లాంట్ ప్రహరీకి ఎంత ఏరియల్ డిస్టెన్స్ లో ఆమ్రాబాద్‌ అటవీ సరిహద్దు ఉందన్న అంశాన్ని కేంద్ర పర్యావరణ శాఖ జన్‌కోను ప్రశ్నించింది. ఇప్పటికే రాష్ట్ర అటవీశాఖ జరిపిన తాజా సర్వేలో అటవీ సరిహద్దు ప్లాంటుకు 14.3 కి.మీ ఏరియల్ డిస్టెన్స్ ఉందని నిర్ధారించింది. ఈ విషయాన్ని పర్యావరణ శాఖ దృష్టికి తీసుకు వెళ్లాలని జెన్‌కో నిర్ణయించింది.

గతంలో ఈసీ జారీచేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసినందున, మరోసారి క్షేత్రస్థాయిలో గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణలో ఇబ్బందులు ఉన్నాయని, ఆన్‌లైన్‌లో చేయడానికి అనుమతించాలని జెన్‌కో ట్రైబ్యునల్‌ను కోరింది. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ ఎన్జీటీకి ఏం నివేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విచారణ జరిగి తీర్పు అనుకూలంగా వస్తేనే ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయసేకరణ సాధ్యమవుతుంది. ఇవన్నీ జరిగి మళ్లీ ఈసీ రావడానికి మరో మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నెముక లాంటి యాదాద్రి విద్యుత్ కేంద్రానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వెంటనే జారీ చేయాలని జెన్‌కో కోరుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…