Telangana: ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కేసులో కీలక అప్‌డేట్స్‌

|

Dec 26, 2024 | 9:00 PM

Telangana: బీఆర్ఎస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారంటూ కంప్లైంట్ చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. ఈనెల 4వ తేదీన కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమర్జెన్సీ ఫీల్డ్‌ డ్యూటీకి వెళ్తుంటే సీఐని ఆపారని,,

Telangana: ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కేసులో కీలక అప్‌డేట్స్‌
Follow us on

బీఆర్ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఉదయమే అరెస్ట్‌ అయ్యారు. సాయంత్రం బెయిల్‌పై బయటకొచ్చారు. రేపు విచారణకు రావాల్సిందేనంటూ మరో బీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. డిసెంబర్ 4న జరిగిన ఆందోళనపై క్లారిటీ ఇవ్వాలన్నారు. మరి కౌశిక్‌రెడ్డి రేపు విచారణకు హాజరవుతారా..? అరెస్ట్‌పై ఎర్రోళ్ల ఏమన్నారు..? పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇంకెవరిని గుర్తించారు..? అసలు కేసు అప్‌డేట్‌ ఏంటి..?

ప్రభుత్వ అధికారులను టచ్‌ చేస్తే ఊరుకోం. పెద్దలైనా, ప్రజాప్రతినిధులైనా.. చట్టం ముందు అందరూ సమానమే అంటూ కొన్నాళ్ల క్రితమే పోలీసులకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికార నేతలైనా.. ప్రతిపక్ష నాయకులకైనా ఒకటే ట్రీట్‌మెంట్‌ అంటూ ఖాకీలకు క్లారిటీ ఇచ్చారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. బీఆర్ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి మాసబ్‌ ట్యాంక్‌ స్టేషన్‌కు తరలించారు. ఉదయం అరెస్టైన ఎర్రోళ్ల… సాయంత్రం బెయిల్‌పై బయటకొచ్చారు.

పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రోళ్ల. ఎన్నికల హామీలను ప్రశ్నిస్తున్నందుకే.. బీఆర్ఎస్‌పై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా నేతలను అరెస్ట్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇక ఇదే కేసులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి నోటీసులిచ్చారు బంజారాహిల్స్‌ పోలీసులు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ సీఐ విధులకు ఎందుకు ఆటంకం కలిగించారో వివరణ ఇవ్వాల్సిందేన్నారు.

బీఆర్ఎస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారంటూ కంప్లైంట్ చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. ఈనెల 4వ తేదీన కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమర్జెన్సీ ఫీల్డ్‌ డ్యూటీకి వెళ్తుంటే సీఐని ఆపారని.. విధులకు ఆటంకం కలిగించారని ఆరోజే కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సహా పలువురిపై కేసు నమోదైంది. మర్నాడు కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఐతే.. కౌశిక్‌రెడ్డికి మద్దతుగా హరీష్‌సహా బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నేతలందరినీ అక్కడి నుంచి అరెస్టు చేసి తరలించారు. అలా వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న టైమ్‌లో.. బంజారాహిల్స్‌ పోలీసులు అటు ఎర్రోళ్లను అరెస్ట్‌ చేయడం.. ఇటు కౌశిక్‌రెడ్డికి విచారణకు రావాలంటూ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.

మొత్తంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని విచారిస్తే మరికొందరు బయటకొస్తారని భావిస్తున్నారు. అందకే కౌశిక్‌ని నోటీసులిచ్చి విచారణకు రమ్మన్నారు. మరి కౌశిక్‌రెడ్డి విచారణకు హాజరవుతారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి