Munugode By Poll: పార్టీలో చేరికలపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారిని చేర్చుకోబోమని క్లారిటీ..

|

Oct 18, 2022 | 2:54 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఓ వైపు టీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ లోని ముఖ్యనాయకులను పార్టీలోకి ఆకర్షించే పనిలో బిజీగా ఉండగా, మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను భుజంపై వేసుకున్నారు. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని..

Munugode By Poll: పార్టీలో చేరికలపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారిని చేర్చుకోబోమని క్లారిటీ..
Bandi Sanjay Kumar
Follow us on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఓ వైపు టీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ లోని ముఖ్యనాయకులను పార్టీలోకి ఆకర్షించే పనిలో బిజీగా ఉండగా, మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను భుజంపై వేసుకున్నారు. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీ మంగళవారం బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తూ మార్గమధ్యలోబీజేపీ ఎస్సీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా ఇంట్లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు లో గెలిచేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. మునుగొడులో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతుండటం తో ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్వరం పట్టుకుందని విమర్శించారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకోసం నిజాయితీగా పనిచేసే నాయకులను మాత్రమే పార్టీ లోకి ఆహ్వానిస్తామన్నారు. ప్రజలకు, పార్టీకి పనికి రాని నాయకులను తీసుకుని తాము ఏం చేసుకుంటామన్నారు. తమ పార్టీలో కూడా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పెరిగారని, అయితే పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. అందరి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ద్రోహన్ని, మోసాలను తట్టుకోలేక బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీని వీడి బీజేపీలోకి వస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం లో మాత్రమే వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం సాధ్యం అని భావించి బూర నర్సయ్య గౌడ్ గారు పార్టీ లో చేరుతున్నారని బండి సంజయ్ తెలిపారు.

మునుగోడు శాసనసభా స్థానానికి నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మునుగోడు శాసనసభ స్థానానికి బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, టీఆర్ ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీచేస్తున్నారు. తెలంగాణ జనసమితి, బీఎస్పీతో పాటు పలువురు స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. టీఆర్ ఎస్, బీజేపీకి చెందిన గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడులోనే మకాం వేశారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. తాను మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు పూర్తి సమయం మునుగోడుకే కేటాయిస్తానని చెప్పారు. దీనిలో భాగంగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ఈరోజు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..