Rahul Gandhi: గిగ్ వర్కర్లకు 12 హామీలతో తెలంగాణ సర్కార్ భరోసా.. కొత్త స్కీమ్ ప్రారంభించిన రాహుల్ గాంధీ..
ఎండనకా, వాననకా ఆన్‌లైన్ యాప్స్ ద్వారా సేవలందిస్తూ, ఎలాంటి ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా తెలంగాణ గిగ్ వర్కర్స్ సంక్షేమ పథకం ప్రారంభమైంది. మొత్తం 12 హామీలతో తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా కార్మికులకు ప్రమాద బీమా, వైద్య భద్రతతో పాటు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఇదే పర్యటనలో భాగంగా భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న రాహుల్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణలోని లక్షలాది మంది డెలివరీ పార్ట్‌నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా సేవలందిస్తూ, ఎలాంటి ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్న గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం సరికొత్త సంక్షేమ పాలసీని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జయభేరి గ్రౌండ్స్ వేదికగా జరిగిన భారీ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా తెలంగాణ గిగ్ వర్కర్స్ సంక్షేమ పథకం ఘనంగా ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. మొత్తం 12 ప్రధాన హామీలతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక సంక్షేమ పాలసీని రూపొందించింది. దీని ద్వారా జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులకు పూర్తి స్థాయి సామాజిక భద్రత లభించనుంది.
ప్రత్యేక గుర్తింపు – బోర్డు
గిగ్ వర్కర్లందరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తోంది. విధుల్లో ఉండగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యుల కోసం వైద్య భద్రతా ప్రయోజనాలను కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలు కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లను కేవలం సేవలందించే వ్యక్తులుగా కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వైఫైతో కూడిన విశ్రాంతి కేంద్రాలు
ఎండనకా, వాననకా రోడ్లపై తిరిగే గిగ్ వర్కర్ల కష్టాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. గిగ్ వర్కర్లు కాసేపు సేదతీరడానికి నగరంలో ప్రత్యేకంగా విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వాటిలో ఉచిత వైఫై సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇన్నాళ్లూ పెద్ద పెద్ద కంపెనీల డేటా రికార్డులు మాత్రమే ఉండేవని, కానీ కష్టపడే గిగ్ వర్కర్ల డేటా ఎక్కడా కనిపించేది కాదని అన్నారు. ఇకపై ప్రతి గిగ్ వర్కర్ వివరాలు అధికారికంగా నమోదై ఉంటాయని, ఎక్కడైనా సులభంగా చూసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.
బీజేపీని ఓడించబోతున్నాం..
మరోవైపు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్‌లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. మోదీ, అమిత్ షాలను ఆగ్రహంతోనూ, విద్వేషం, హింసతో ఓడించలేమనీ చెప్పారు. సత్యం, అహింస, ప్రేమతోనే ఓడించగలమని రాహుల్ చెప్పారాయన. ఢిల్లీ వీధుల్లో ఈ విషయం నిరూపించామని రాహుల్ చెప్పారు.
