AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగకు సొంతూళ్ల బాట.. కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్!

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి పల్లెలకు బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

పండుగకు సొంతూళ్ల బాట.. కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్!
Dasara Festival Rush
Balaraju Goud
|

Updated on: Oct 18, 2026 | 8:31 AM

Share

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి పల్లెలకు బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల అవస్థలు

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) కిటకిటలాడుతోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ప్రయాణికులు బస్సుల కోసం గంట నుంచి గంటన్నర వరకు వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇదిలావుంటే పండుగ రద్దీ నేపథ్యంలో టికెట్ ధరలపై అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే అంశంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జేబీఎస్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనూ రద్దీ

సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ప్రయాణికుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో ప్రజలు ముందుగానే ప్రయాణాలు ప్రారంభించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు బయలుదేరడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. మొత్తం 16 టోల్ బూత్‌లలో విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం ఎనిమిది, హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల కోసం మరో ఎనిమిది బూత్‌లను అందుబాటులో ఉంచినట్లు సిబ్బంది తెలిపారు.

పండుగల నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. రహదారులపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us