మామూలుగా వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా మటన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజు చికెన్ లాగించడం కామన్‌గా మారింది. ఎక్కువగా మార్కెట్‌లో బాయిలర్ కోళ్లు అందుబాటులో ఉండడం.. ధర కూడా అన్ని వర్గాల వారికి సరసంగా ఉండటంతో ఆ కోడి మాంసాన్ని తింటున్నారు. కానీ తెలంగాణలో అందుబాటులో ఉన్నబ్రాయిలర్ కోళ్ల మాంసాన్ని తినడం అంత మంచిది కాదు అంటున్నారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు కేరళలో అందుబాటులో ఉన్న కోళ్ల మాంసంలో యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు NIN శాస్త్రవేత్తలు గుర్తించారు. కోళ్ల ఫామ్‌లలో కోళ్లకు అవసరం అయినా లేకపోయినా యాంటీబయోటిక్స్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతున్నదని పరిశోధకులు నిర్ధారించారు. ఇలాంటి మాంసంను సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేల్చారు.
పరిశోధనలో భాగంగా కొన్ని కోళ్ల ఫామ్‌లోని 100 వరకు శాంపిలను స్వీకరించి వాటి నుంచి డిఎన్ఏలు వేరుచేసి రీసెర్చ్ చేయగా షాకింగ్ కలిగించే అంశాలు తెలిసాయి. ఈ ఫామ్ కోళ్ల రెట్టలో విరోచనాలకు కారణమయ్యే ఈ కోలి, చర్మవ్యాధులకు కారణమయ్యే స్టెఫీలో కాకస్ ఆరియాస్‌తో పాటు క్లాస్ట్రిడియం పెర్ ఫ్రిజెన్స్, క్లెబ్సియెల్లా ఎంటరో కోకస్ ఫెకాలిస్ లాంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవన్నీ కూడా మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్‌కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని NIN డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు తెలిపారు. ఇలాంటి చికెన్‌ను ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందని చెప్పారు. మిగిలినది మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.
భారతీయ శాస్త్రవేత్తలు కేరళ, తెలంగాణ నుండి పౌల్ట్రీలో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) జన్యు ప్రొఫైల్‌లను కనుగొన్నారు. దీని కారణంగా నిమోనియా లేదా ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఇబ్బంది కలిగించే అనారోగ్యమైన జబ్బులు వస్తాయని.. తర్వాత ట్రీట్మెంట్‌కు సవాల్‌గా మారుతుంది అంటున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పర్యావరణ వ్యవస్థలో స్ప్రెడ్ అవ్వకుండా ప్రభుత్వమే ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి