Crime Rate 2024: దొంగ-పోలీస్.. 2024లో తెలుగు రాష్ట్రాల్లో నేరాల చిట్టా ఇది

|

Dec 28, 2024 | 8:54 PM

తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే ఏ ఏ కేసులు పెరిగాయి? తెలంగాణా పెరిగి సైబర్ నేరాలు.. ఎపిలోనూ అదే పరిస్ధితి. ఇప్పటికే నెంబర్స్ రిలీజ్ చేసిన ఇరు రాష్ట్రాల డిజిపి. పోటీగా గట్టిగా రికవరీలు చేస్తున్న పోలీసులు. కానీ, గోల్డెన్ అవరే కీలకం అంటూ పోలీసుల సూచన. ఎన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఫ్రాడ్ గాళ్ళు.

Crime Rate 2024: దొంగ-పోలీస్.. 2024లో తెలుగు రాష్ట్రాల్లో నేరాల చిట్టా ఇది
Crime Rate In Telugu States
Follow us on

మొత్తానికి.. ఏడాది చివరికి వచ్చేశాం. తీపి గుర్తులు, అందమైన జ్ఞాపకాలు చాలామందికి ఉంటాయ్. వాళ్లని ఆ ఆనందడోలికల్లో అలా ఉండనిద్దాం. కాని, కొందరి విషయంలో మానని గాయాలు, తలుచుకుంటేనే వణికిపోయేంత దారుణాలు జరిగి ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. విజయం వల్ల వచ్చే లాభాల కంటే ఓటమి నేర్పే పాఠాలే ఎక్కువన్నట్టు.. సమాజంలో జరుగుతున్న దారుణాలను ఓ కంటకనిపెడితేనే.. బహుశా అలాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అవగాహన కల్పించడం అంటే ఇదే. ‘ఇదిగో ఫలానా చోట ఇలా నేరం జరిగింది.. రేప్పొద్దున మీకూ ఎదురైతే ఇలా స్పందించండి’ అని చెప్పడమే అవేర్‌నెస్‌. పాము కాటు వేస్తే.. ఆ విషాన్ని విరిచేసే ఔషధం కూడా పాము విషమే. సో, నేరాల నుంచి, మోసాల నుంచి బయటపడాలంటే.. పర్టిక్యులర్‌గా కొన్ని నేరాల గురించి, అవి ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో తెలుసుకుని తీరాలి. క్రైమ్‌ రేట్‌ ఎక్కడ ఎక్కువగా ఉందో అవగాహన పెంచుకోవాలి.

‘దొంగలున్నారు జాగ్రత్త’ అని బోర్డ్ పెడతారు. ఎవరు పెడతారు ఆ బోర్డు? ఇంకెవరు.. పోలీసులే..! దొంగలు ఉన్నారు అని తెలిసీ వారిని పట్టుకోకుండా.. అలా బోర్డులు పెడితే ఏం లాభం? ఈ డౌట్‌ చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. సో, దీనికి సమాధానం ఏంటంటే.. నేరాలను అదుపు చేయడం అనేది ఆల్‌మోస్ట్‌ ఇంపాజిబుల్. ఓసారి గూగుల్‌ చేసి చూడండి. ‘జీరో క్రైమ్‌ కంట్రీ’ అని సెర్చ్ చేయండి. ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్.. ఇలాంటి దేశాల పేర్లు కనిపిస్తాయి మనకు. అలాగని అక్కడ నేరాలే ఉండవా అంటే.. ‘తక్కువ’ నేరాలు జరుగుతాయి అని రాసి ఉంటుంది. సో, ఈ భూమ్మీద నేరాలు జరగని ప్రాంతమే లేదు. ఈ భూమ్మీద పుట్టే ప్రతి మనిషికి.. మరో మనిషితో పోలికే లేని వేలిముద్రలు ఎలా పుట్టుకొస్తాయో.. నేరాలు కూడా అలాగే పుట్టుకొస్తాయి. ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు నేరం చేస్తారో ఊహించేంత టెక్నాలజీ, అలాంటి భవిష్యవాణి, వాళ్లను ఆపగలిగేంత శక్తి మన దగ్గర లేదు. సో, ‘దొంగలున్నారు జాగ్రత్త’ అని బోర్డ్‌ చూసి, ఎవరికి వాళ్లు అలర్ట్‌గా ఉండడం ఒక్కటే పరిష్కార మార్గం. సో, సమాధానం వచ్చేసిందనుకుంటా.. దొంగలుంటారని తెలిసినా వాళ్లని పట్టుకోకుండా ఎందుకని బోర్డ్‌ పెడతారో..!

ఇక అసలు విషయానికొద్దాం. తెలంగాణలో.. పర్టిక్యులర్‌గా హైదరాబాద్‌లో.. ఈ ఏడాది జరిగిన క్రైమ్‌ రేట్‌ ఎంతో చూద్దాం. హైదరాబాద్-సైబరాబాద్-రాచకొండ.. ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన నేరాలు-ఘోరాలే.. ఓవరాల్‌ హైదరాబాద్‌ క్రైమ్‌ రేట్. ముందుగా హైదరాబాద్ కమిషనరేట్. ఏడాది ప్రశాంతంగానే గడిచింది.. కాని, క్రైమ్‌ రేట్‌ పెరిగింది. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. నేరాలు పెరిగాయని ఎలా తెలుస్తుంది? FIR ఫైల్‌ అయితేనే కదా. అంటే.. కంప్లైంట్‌ ఇస్తేనే కదా. ఈ కంప్లైంట్‌ చేయాలనే అవగాహన బాగా పెరిగింది జనాల్లో. నిత్యం ఎక్కడో అక్కడ క్రైమ్‌ జరుగుతూనే ఉంటుంది. కాని, చాలా కేసులలో కంప్లైంట్స్‌ చేయరు. బట్.. జనాల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కారణంగా జనాల్లో ధైర్యం వస్తున్నకొద్దీ.. నిర్భయంగా పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే, ప్రతి ఏటా క్రైమ్‌ రేట్‌ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

సపోజ్‌ హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధినే తీసుకుంటే.. ఈ ఏడాది 35వేల 944 ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్‌ అయ్యాయి. గతేడాది కంటే 45 శాతం ఎఫ్ఐఆర్‌ల నమోదు పెరిగింది. హత్యలు 13 శాతం తగ్గడంతో పాటు హత్యాయత్నం కేసులు కూడా తగ్గాయి. బట్.. కిడ్నాప్ కేసులు 88 శాతం పెరిగాయి. సో, మహిళలు, ఆడపిల్లలు, పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండడమే బెటర్‌ అని సూచిస్తోంది ఈ ఇయర్‌ డేటా. అందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది డిజిటల్ అరెస్టులు గురించి. ఇదీ సైబర్‌ నేరాల్లో ఒక భాగం. ఈ సైబర్‌ నేరాల గురించి కాసేపట్లో డిటైల్డ్‌గా చెప్పుకుందాం. ఇక ఈ ఏడాది ఆస్తులకు సంబంధించిన కేసులు 67 శాతం పెరిగాయి. మరీ ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఈ ఏడాది బాగా పెరిగాయి. డిపాజిట్ పేర్లతో, ప్రీ లాంచింగ్‌ ఆఫర్లతో జనాల్ని ముంచేశాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. స్కీమ్స్‌లో, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని మాయ చేసి కోట్లు దోచేశారు. ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే.. 3వేల కోట్లు, హైదరాబాద్‌ పరిధిలో వెయ్యి కోట్లు దోచేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు అరెస్ట్‌లైతే చేయగలుగుతున్నారు గానీ.. రికవరీ చేయలేకపోతున్నారు. దోచేసిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుండడంతో రికవరీ జరగడంలేదు. పైగా.. వాళ్లే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. సో, ఇప్పటికైనా ప్రీ లాంచింగ్‌ పేరు చెప్పి ఇల్లు కట్టిస్తామని చెబితే నమ్మకండి. అందమైన బ్రోచర్లు చూసి ఊరు పేరు లేని రియల్‌ ఎస్టేట్‌ సంస్థల దగ్గరికి వెళ్లకండి. చిన్న పెట్టుబడితో బోలెడు లాభాలు చూపిస్తామంటే.. నమ్మి బుట్టలో పడకండి.

ఇక రాచకొండ పోలీస్‌ కమిషనరేట్. ఇక్కడ జరిగిన నేరాలు తక్కువ.. సైబర్ మోసాలు ఎక్కువ. లాస్ట్‌ ఇయర్‌తో కంపేర్‌ చేస్తే నేరాలు 4 శాతం పెరిగాయి. ఇక లైంగిక దాడులు 17 శాతం పెరిగాయి. సో, మహిళలు, ఆడపిల్లల విషయంలో కుటుంబం తరపు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఇక వరకట్న హత్యలు 13 శాతం, హత్యలు 11 శాతం, కిడ్నాప్‌‌‌‌లు 10 శాతం, భౌతిక దాడులకు సంబంధించి 9 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

ఇక సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్. గతేడాదితో పోలిస్తే క్రైం రేట్‌ ఏకంగా 64 శాతం పెరిగింది. మొత్తం మూడు పోలీస్‌ కమిషనరేట్లలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఎక్కువ నేరాలు జరిగాయి. అయితే.. వీటిలో ఆస్తి గొడవలు, ఆర్థిక నేరాలు, సాధారణ దాడులే ఎక్కువ. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగాయి. వరకట్న వేధింపుల కేసులు కూడా గతేడాదికంటే ఎక్కువగా నమోదయ్యాయి.

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేరాలు తగ్గాయి. గతేడాదితో పోల్చితే.. ఓవరాల్ క్రైం రేట్ 5.2 శాతం తగ్గింది. కాని, మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం పెరిగాయి. ఏపీలో మహిళల హత్యలు ఏకంగా 20 శాతం పెరిగాయి. సో, రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా.. మహిళలు, ఆడపిల్లలే అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెబుతున్నాయి ఈ రిపోర్ట్స్‌.

తెలుగు రాష్ట్రాల డీజీపీలైనా, కమిషనరేట్ల పరిధిలోని సీపీలు అయినా.. ఒకే ఒక్క విషయంపై ‘డేంజరస్’ సిగ్నల్స్‌ పంపుతున్నారు. ఎంత కంట్రోల్‌ చేస్తున్నా.. పేట్రేగిపోతున్న ఓ క్రైమ్ గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. అదే సైబర్‌ క్రైమ్.

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సైబర్‌ మోసాలు, అవి జరుగుతున్న తీరుపై డిటైల్డ్‌గా చూడండి..

‘గోల్డెన్‌ అవర్’ గురించి తెలుసా. ప్రమాదం జరిగిన గంటలో ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలు నిలబడే ఛాన్సెస్‌ ఎక్కువగా ఉంటాయి. అలాగే.. నేరాల్లోనూ ‘గోల్డెన్‌ అవర్‌’ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సైబర్‌ నేరాల్లో. ఈ సైబర్‌ నేరాల స్థాయి గురించి, తీవ్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. సపోజ్.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధినే తీసుకుందాం. ఇక్కడ ఈ ఏడాది నమోదైన సైబర్‌ నేరాల సంఖ్య.. 4వేల 42. ప్రజల నుంచి అన్యాయంగా కాజేసిన సొమ్ము 296 కోట్ల రూపాయలు. అమాయకుల నుంచి 296 కోట్లు కాజేస్తే.. అందులోంచి రికవరీ చేసింది జస్ట్ 42 కోట్లు మాత్రమే. అంటే.. రోజుకు 11 మందిని నిలువునా మోసం చేసి, డబ్బు కాజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో.. అందులోనూ ఒక్క కమిషనరేట్‌ పరిధిలోనే రోజుకు 11 మంది మోసపోతుంటే.. ఇక హైదరాబాద్‌లో, తెలుగు రాష్ట్రాల్లో సైబర్‌ నేరాల తీవ్రత ఎంత ఉంటుందో ఊహించుకోండి. అందుకే.. డీజీపీల నుంచి సీపీల వరకు ప్రతి ఒక్కరూ డేంజర్ సిగ్నల్‌ పంపుతున్నది ఈ సైబర్ నేరాల గురించే.

ఇక సైబరాబాద్‌ కమిషనరేట్‌ అయితే.. సైబర్‌ నేరాల్లో టాప్‌లో ఉంది. ఏకంగా 11వేల 914 మంది మోసపోయారు. ఈ ఏడాది నవంబర్‌ వరకు 793 కోట్ల రూపాయలు దోచేశారు. చాలా కేసుల్లో కేటుగాళ్లను పట్టుకున్నారు కూడా. కాని, 793 కోట్లు దోచేస్తే ఎంత రికవరీ అయిందో తెలుసా. 70 కోట్ల 46 లక్షల 11వేల 458 రూపాయలు. ఇక.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలు.. గతేడాదితో పోలిస్తే 57 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో 4వేల 458 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. నేరస్తుల ఖాతాల్లోని 23 కోట్లు మాత్రమే ఫ్రీజ్‌ చేయగలిగారు. మరో 22 కోట్ల రూపాయలు రిఫండ్‌ చేశారు. అందుకే, ‘గోల్డెన్‌ అవర్‌’ గురించి ప్రత్యేకంగా చెబుతున్నది. సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయామని తెలిసిన వెంటనే కంప్లైంట్‌ చేయడం మరిచిపోకూడదు. అలాగని డబ్బు పోగొట్టుకున్న గంటలోనే కంప్లైంట్‌ చేస్తే.. పోయిన సొమ్ము తిరిగొస్తుందన్న గ్యారెంటీ ఏం లేదు. వస్తే అదృష్టం.. అంతే.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరాలు 34 శాతం పెరిగాయి. 916 మంది నుంచి ఒకవేయి 229 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. మరి ఎంత రికవరీ అయింది అని అడగకండి.. ప్లీజ్. చెప్పుకోవడం కూడా అనవసరం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరు నెలల్లోనే ఫోన్‌ ద్వారా ఏకంగా 25వేల ఫిర్యాదులు అందాయి. అంటే.. రోజుకు 133 మంది తాము మోసపోయాం, డబ్బులు పోగొట్టుకున్నాం అంటూ కంప్లైంట్స్‌ చేశారు. ఇది కేవలం ఆరు నెలల డేటా మాత్రమే. దోపిడీలు, దొంగతనాలతో 80 కోట్లు పోగొట్టుకుంటే.. సైబర్ నేరాల్లో అంతకంటే ఎక్కువ పోగొట్టుకున్నారు.

ఇది వరకు జేబులు కత్తిరించేవాళ్లు, బెదిరించి దారిదోపిడీలు చేసే వాళ్లు ఎక్కువగా ఉండేవాళ్లు. ఇప్పుడందరూ ఫోన్‌పేలకు అలవాటు పడడం, పోలీసుల రెక్కీ కూడా పెరగడంతో.. ఇంట్లో ఉంటున్న వారిని ఇంట్లోనే దోచేస్తున్నారు. జస్ట్‌ లింక్‌ పంపించడమో, ఓటీపీ చెప్పమనడమో, కేసులు నమోదయ్యాయని బెదిరించడమో.. ఇలాంటి పనులతో జస్ట్ ఫోన్‌ ద్వారానే వేల కోట్లు దోచేస్తున్నారు. ఈమధ్య డిజిటల్ అరెస్టులు విపరీతంగా పెరిగాయి. మీపై కేసు నమోదైంది.. అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే మేం చెప్పింది చేయాలంటూ దోచేస్తున్నారు. లేదా.. ‘మీ అమ్మాయి లేదా అబ్బాయిని, లేదా ఫ్యామిలీలో ఒకరిని కిడ్నాప్‌ చేశామంటూ కాల్‌ చేసి, వాళ్లు చెప్పిన పని చేసేలా చేసి.. డబ్బు కాజేస్తున్నారు. ఆ లెక్కన.. సైబర్ నేరగాళ్లు ఒక్క తెలంగాణలో ఎంత దోచేశారో తెలుసా. అటుఇటుగా 2వేల కోట్ల రూపాయలు. చిన్నపాటి ప్రాజెక్టే కట్టేయొచ్చు ఆ డబ్బుతో. సైబర్‌ నేరాలపై ఎంత అవగాహన పెంచుతున్నారో.. అంతకంటే ఎక్కువ తెలివిమీరుతున్నారు మోసగాళ్లు. ఒకసారి ఈ నెంబర్స్‌ వినండి. సైబర్‌ నేరగాళ్లు తెలంగాణలో గతేడాది 778 కోట్లు లూటీ చేస్తే.. ఈ ఏడాది 1867 కోట్లు దోచేశారు. అంటే.. ఒకవేయి 88 కోట్లు లాస్ట్ ఇయర్‌ కంటే ఎక్కువ కాజేశారు. ఎలా మోసం చేస్తారు వీళ్లంతా అంటే.. ఆ పద్దతులన్నీ చెప్పడానికి ఒక్క ఎపిసోడ్‌ సరిపోదు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. ఇప్పటి వరకు తేలిన లెక్క ప్రకారం.. 34 పద్దతుల్లో అమాయకులను బోల్తా కొట్టించారు. రాబోయే రోజుల్లో సరికొత్త పద్దతుల్లో మోసం చేస్తారు. కాకపోతే.. బిజినెస్‌ ఇన్వెస్టిమెంట్‌, స్టాక్స్‌, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌, డిజిటల్‌ అరెస్ట్, ఫేక్‌ కస్టమర్‌ సర్వీసెస్‌, డెబిట్‌-క్రెడిట్‌ కార్డ్స్‌.. వీటి రూపంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్టు తేల్చారు. మరో విషయం.. చదువురాని వాళ్లనే మోసం చేస్తారని పొరబడుతుంటారు చాలామంది. బాగా చదువుకున్న వాళ్లు, మంచి జీతం-మంచి ఉద్యోగం చేస్తున్నవాళ్లను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. అసలు వాళ్లూవీళ్లు అని లేదు. ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు.. ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేస్తున్నారు.

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్.. ఈ ఏడాది జరిగిన సైబర్‌ నేరాల వివరాలు బయటపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 14వేల 174 ఫిర్యాదులు అందినట్టు షాకింగ్‌ డిటైల్స్‌ చెప్పారు. సైబరాబాద్‌ రీజియన్‌లో 25వేల 112 కంప్లైంట్లు, హైదరాబాద్‌ రీజియన్‌లో 20వేల 229, రాచకొండ పరిధిలో 14వేల 815, వరంగల్‌ పరిధిలో 3వేల 531, సంగారెడ్డిలో 3వేల 132 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఏడాదికి లక్షకు పైగా కంప్లైంట్లు వస్తున్నాయంటే.. ఎంత మంది, ఎన్ని ముఠాలు మీ ఖాతాలోని డబ్బుల కోసం కాచుకుని కూర్చున్నారో అర్థం చేసుకోండి. వాట్సాప్‌ డీపీల్లో మీకు తెలిసిన వారి ఫొటో పెట్టేసి.. అర్జెంట్‌గా డబ్బులు కావాలని వాట్సాప్ చేస్తారు. మోసాల్లో ఇదో రకం. మీరు ఊహించలేని మోసం. మీ పేరు మీద కొరియర్‌ వచ్చిందంటారు, ఫేక్‌ మెసేజ్‌లు పెడతారు, నకిలీ లింక్‌లు పెడతారు, కస్టమర్ కేర్ అంటూ కాల్ చేస్తారు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ పేరుతో ఊరించి కాజేస్తారు, ఓటీపీలు, సోషల్‌ మీడియాలు, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ అంటూ వీలైనన్ని పద్దతులు ప్రయోగించి దోచేస్తున్నారు కేటుగాళ్లు. సో, వచ్చే ప్రతి unknown కాల్, ప్రతి మెసేజ్, ప్రతి వాట్సాప్.. అన్నింటీని అనుమానించడం అలవాటు చేసుకోండి. సినిమా హీరోలు, డైరెక్టర్లు, సెలబ్రిటీలతో చెప్పించే అవగాహన కార్యక్రమాలను ఒక్కసారి చూడండి. ఎలా మోసం చేయొచ్చో కొన్ని ఉదాహరణలతో చెబుతుంటారు. అవన్నీ కచ్చితంగా వినండి. ఇంత చేసినా.. మోసపోరు అనే గ్యారెంటీ లేదండోయ్. కేటుగాళ్లు కొత్త రూట్‌ వెతుక్కుని మరీ వస్తారు. సో, అనుక్షణం అలర్ట్‌గా ఉండడం ఒక్కటే మీ డబ్బుకు శ్రీరామరక్ష.

ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల గురించే చెప్పుకున్నాం. కాని, దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్‌ నేరాలు జరిగాయి తెలుసా ఈ ఏడాది మొత్తంలో. ఈ లెక్కన వచ్చే ఏడాది ఎలా ఎంత భీకరంగా ఉండబోతోందో ఊహించుకోండి. నెక్ట్స్‌ ఇయర్‌ నుంచి సరికొత్తగా సైబర్‌ దాడులు చేయొచ్చని ‘ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్‌’ ఓ వార్నింగ్‌ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఎలా మోసం చేస్తారో తెలుసా వీళ్లు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుని దొరికినంత దోచేయబోతున్నారు. ఈ టైప్‌ మోసగాళ్ల మెయిన్‌ టార్గెట్‌ ఎవరో.. కనీసం అంచనా కూడా వేయలేరు. ఛాలెంజ్. ఇంతకీ, నెక్ట్స్ టార్గెట్‌ అయ్యేది ఎవరో తెలుసా. ప్రభుత్వాల నుంచి పథకాలు అందుకుంటున్న వాళ్లే. ‘ఇదిగో మీకు పెన్షన్‌ పెరిగింది, మీకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు వచ్చింది, ఫలానా పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయి’.. ఇలా ఒక్కో పేరు చెప్పి దోచుకోబోతున్నారట. అచ్చంగా ప్రభుత్వ యాప్‌లే అని అనిపించేలా నకిలీ యాప్‌లు తయారు చేసి, వాటి ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. నట్టేట ముంచడానికి సిద్ధమవుతున్నారనే వార్నింగ్స్‌ వస్తున్నాయి. అంతటితో ఆగడం లేదు వీళ్లు. ఏకంగా పర్సనల్‌ లైఫ్‌లోకి కూడా ఎంటర్‌ అవడానికి రెడీ అవుతున్నారు. మీ డిజిటల్‌ రికార్డులు.. అంటే వేలిముద్రలు, కనుపాపలు ఎక్కడో అక్కడ రికార్డ్‌ అయి ఉంటాయి. వాటి సాయంతో దోచేయబోతున్నారు. లేదా ఆధార్- పాన్‌- బ్యాంక్‌ అకౌంట్‌ కాపీలను ఎవరో ఒకరికి షేర్‌ చేసి ఉంటారు కదా. వాటిని కలెక్ట్‌ చేయబోతున్నారు. లేదా మీ ఫోన్‌లోకే చొరబడి సేకరిస్తారు. వాటి ద్వారా మీ అకౌంట్లు మొత్తం ఖాళీ చేస్తారు. ఈసారి సామాన్యులనే కాదు.. ఏకంగా కంపెనీలను బోల్తా కొట్టించడానికి రెడీ అవుతున్నారట. మెయిన్‌గా హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఆతిథ్య రంగాలకు సంబంధించిన కంపెనీలను దోచేందుకు ప్లాన్ చేస్తున్నారని డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సెక్‌రైట్‌ అనే సంస్థలు ఓ నివేదిక విడుదల చేశాయి. సో.. రాబోయే కాలం అంతా సైబర్‌ నేరగాళ్లదే. ఆదాయం 14, రాజపూజ్యం 14 అన్నట్టుగా వాళ్ల ఆటలు సాగబోతున్నాయి. సో, బీ అలర్ట్. ఈ ఒక్క ముక్క చెప్పడం మినహా.. ఇచ్చే సలహా కూడా ఏం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..