Telangana: పండుగ పూట విషాదం.. 12 ఏళ్ల బాలికను బలిగొన్న గుండెపోటు

| Edited By: Ram Naramaneni

Nov 15, 2024 | 3:46 PM

ఒకప్పుడు 60 ఏళ్లు పైబడ్డవారికే గుండెపోటు గండం. కానీ... ఇప్పుడు గుండెపోటుకు వయసు తేడాల్లేవు. చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతారు. ఇక సెలవంటూ వెళ్లిపోతున్నారు. మంచిర్యాల జిల్లా తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది.

Telangana: పండుగ పూట విషాదం.. 12 ఏళ్ల బాలికను బలిగొన్న గుండెపోటు
Nivruthi
Follow us on

వయసుతో‌ అస్సలు‌ సంబంధం లేకుండా గుండెపోటు ప్రాణాలు హరిస్తోంది. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. మంచిర్యాల జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలిక ప్రాణాలు మింగేసింది గుండెపోటు. చెన్నూర్ పట్టణంలో పండుగ పూట విషాదం నెలకొంది. పట్టణంలోని పద్మనగర్ కాలనీకి చెందిన నివృతి (12) అనే చిన్నారి ఉదయం ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నివృతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు నివృతి అప్పటికే మృతి చెందినట్లుగా ధృ వీకరించారు. గుండె పోటు కారణంగా మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఉన్నత చదువులు చదివి తమకు పేరు ప్రతిష్టలు తెస్తుందని కలలు కన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియశాలుగా మిగిలిపోయాయి. మాయదారి గుండెపోటు 12 ఏళ్ల చిన్నారిని పొట్టుకుందని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. తమ గారాల పట్టి చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిందంటూ, ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అతి చిన్న వయసులోనే నివృతి గుండె పోటుతో మృతి చెందడంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చెన్నూర్ పద్మానగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ – రమ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. నివృత్తి మొదటి సంతానం. చెన్నూర్ పట్టణంలోని స్థానిక పాఠశాలలో పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కార్తీక పౌర్ణమి కావడంతో పాఠశాలకు సెలవు‌ ఇచ్చారు. పండుగ పనుల్లో నిమగ్నమైన చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడం అందరిని కలచివేసింది. నివృతి మరణ వార్త విన్న పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీళ్లతో నివృతికి‌ నివాళులర్పించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…