
ఈ రోజుల్లో అన్నం లేకపోయినా ఉండగలమేమో కానీ.. ఇంటర్నెట్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేం. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, మూవీ స్ట్రీమింగ్.. ఇలా అంతా వైఫై తోనే ముడిపడి ఉంది. కానీ సరిగ్గా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడే ఆ చక్రం తిరుగుతూ.. వీడియో బఫర్ అవుతుంటే వచ్చే కోపం అంతా ఇంతా కాదు.. నెట్ స్లోగా వస్తుందని కంప్లైంట్ చేస్తే.. సిగ్నల్ సరిగ్గా ఉంది సార్ అని కంపెనీ వాళ్లు సమాధానం చెబుతుంటారు. మరి లోపం ఎక్కడ ఉంది? మీ ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో రౌటర్ ప్లేస్‌మెంట్ మార్చడం ద్వారా కొన్ని చిన్న సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా.. మీ వైఫై స్పీడ్‌ను రాకెట్‌లా ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం..
చాలామంది వైఫై రౌటర్‌ను ఒక మూలలోనో, అల్మారా వెనుకనో లేదా కిటికీ దగ్గరో పెడుతుంటారు. ఇది అతిపెద్ద తప్పు. వైఫై సిగ్నల్స్ గోడలు, ఫర్నిచర్ దాటుకుని రావడానికి ఇబ్బంది పడతాయి. అలాగే ఇంట్లో ఉండే మైక్రోవేవ్ ఓవెన్లు, బేబీ మానిటర్లు, బ్లూటూత్ స్పీకర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వైఫై సిగ్నల్స్‌ను అడ్డుకుంటాయి.
వైఫై రౌటర్‌ను ఎప్పుడూ ఇంటికి మధ్యలో ఉండే గదిలో, కొంచెం ఎత్తులో ఉంచాలి. దీనివల్ల సిగ్నల్స్ ఇంటి నలుమూలలకు సమానంగా అందుతాయి. రౌటర్ చుట్టూ ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోండి.
మీ రౌటర్ డ్యూయల్ బ్యాండ్ అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి 5GHz బ్యాండ్‌ను ఎంచుకోండి. పాత 2.4GHz బ్యాండ్ కంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇతర పరికరాల వల్ల వచ్చే అంతరాయం ఇందులో తక్కువగా ఉంటుంది.
మీ చుట్టుపక్కల ఇళ్లలో కూడా వైఫై నెట్‌వర్క్‌లు ఉంటే ఆ సిగ్నల్స్ మీ నెట్‌వర్క్‌తో ఘర్షణ పడే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు రౌటర్ సెట్టింగ్స్‌లో ఛానెల్ మార్చడం ద్వారా వేగాన్ని మెరుగుపరచుకోవచ్చు.
మొబైల్ ఫోన్ల లాగే రౌటర్లను కూడా అప్‌డేట్ చేయాలి. కంపెనీ విడుదల చేసే ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేయడం వల్ల భద్రతతో పాటు వేగం కూడా పెరుగుతుంది. మీ రౌటర్ మరీ పాతదైతే, లేటెస్ట్ Wi-Fi 6 మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం ఉత్తమం.
ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్‌ను తిట్టుకునే కంటే, ముందుగా మీ రౌటర్ స్థానాన్ని మార్చి చూడండి. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా, కనెక్టివిటీ సమస్యలు కూడా దూరమవుతాయి.