ఇవాళ ఆకాశంలో మహా అద్భుతం.. ఖగోళ చరిత్రలో అరుదైన ఘటన.. రెండు గంటల పాటు ఆవిష్కృతం..!

ఇవాళ శనివారం (ఫిబ్రవరి 28) ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. అరుదైన ప్లానెట్‌ పరేడ్‌ కనువిందు చేయబోతోంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇంతకీ.. ఈ ఆరు గ్రహాల ప్లానెట్‌ పరేడ్‌ స్పెషల్‌ ఏంటి?.. ఏ టైమ్‌లో ఆరు గ్రహాలు సందడి చేయబోతున్నాయి?.. గ్రహాల కూటమిని ఎలా చూడాలి?.. ప్లానెట్‌ పరేడ్‌పై అసలు సైంటిస్టులు ఏం చెప్తున్నారు?

ఇవాళ ఆకాశంలో మహా అద్భుతం.. ఖగోళ చరిత్రలో అరుదైన ఘటన.. రెండు గంటల పాటు ఆవిష్కృతం..!
Planetary Parade

Updated on: Feb 28, 2026 | 7:12 AM

వరుస అద్భుతాలకు ఆకాశం వేదిక కాబోతోంది. ఈ ఏడాదిలో చంద్రగ్రహణం, బ్లూమూన్‌, సూపర్‌మూన్‌లు ఆకట్టుకోబోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇవాళ శనివారం (ఫిబ్రవరి 28) ఆకాశంలో ఆరు గ్రహాల మహా అద్భుతం సందడి చేయబోతోంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొన్ని గ్రహాల అరుదైన కదలికల దృశ్యం ఆవిష్కృతం కానుంది. విశ్వంలోని అరుదైన ఖగోళ సంఘటనల్లో ఒకటైన ప్లానెటరీ పరేడ్ జరగబోతోంది. ఈ అద్భుత ఘట్టంలో సౌర కుటుంబంలోని ప్రత్యేకమైన ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించబోతున్నాయి.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత 6 నుంచి 8 గంటల మధ్య ఈ అద్భుతం ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. బృహస్పతి, శుక్రుడు, బుధుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లాంటి ప్రధాన గ్రహాలు ఒకే వరసలోకి రాబోతున్నాయి. ఈ ఆరు గ్రహాలు సూర్యుని చుట్టూ ఒకే సమతలంలో పరిభ్రమిస్తుండటంతో భూమి నుంచి చూస్తే అవి ఒకే వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. బుధుడు, శుక్రుడు, శని, గురుడు కంటి ద్వారా డైరెక్ట్‌గానే చూసే అవకాశం ఉండగా.. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను మాత్రం బైనాక్యులర్‌, టెలీస్కోప్‌ ద్వారానే చూడగల్గుతామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇక.. ఆకాశం ప్రశాంతంగా.. నిర్మలంగా ఉంటే.. ఎలాంటి పరికరాల సహాయం లేకుండానే పశ్చిమ దిశలో కొన్ని గ్రహాలను నేరుగా సులభంగా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే.. గ్రహాలను గుర్తించడానికి కొన్ని సూచనలు చేశారు. శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా పశ్చిమ దిక్కులో మెరిసిపోనున్నాడు. కుజుడు ఎర్రటి బిందువులా కనిపిస్తాడు. శని గ్రహం పసుపు ఛాయతో కనువిందు చేయనున్నాడు. అలాగే.. గురుడు ఆకాశంలో ఎత్తుగా ప్రకాశిస్తాడు. బుధుడు మాత్రం హైరైజన్‌కు దగ్గరగా.. సూర్యాస్తమయం తర్వాత కొద్ది సమయంలోనే కనిపించే అవకాశం ఉందని సైంటిస్టులు తెలిపారు.

అందులోనూ నగరాలకు దూరంగా పల్లె ప్రాంతాల నుంచి ఈ ప్లానెట్‌ పరేడ్‌ స్పష్టంగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఆకాశంలో మేఘాల వస్తే మాత్రం ఈ అద్భుత దృశ్యం కనిపించకపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తంగా.. ఇవాళ ఆకాశంలో ఆరు గ్రహల ప్లానెట్‌ పరేడ్‌తో అద్భుతం జరగబోతుండడం ఉత్కంఠ రేపుతోంది. వాతావరణం అనుకూలిస్తే ఈ అరుదైన ఖగోళ దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us