
90వ దశకం చివర్లో, 2000 ప్రారంభంలో రిలీజైన నోకియా 3210 మొబైల్ గురించి తెలియని వారుండరు. అప్పట్లో మొబైల్ ప్రపంచాన్ని ఊపేసిన మోడల్ ఇది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే భారీ స్థాయిలో అమ్ముడై రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఫోన్.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడేందుకు అత్యాధునిక ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD దీనిని అద్భుతమైన ఫీచర్లతో మళ్లీ తీసుకొచ్చింది.
ఫోన్ లుక్, ఫీచర్లు
యూజర్లకు అప్పటి అనుభూతిని మళ్లీ అందించాలనే ఉద్దేశంతో, తయారీ సంస్థ ఈ మోడల్‌ను పాత రెట్రో డిజైన్, కీప్యాడ్‌తోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. చూడ్డానికి ఓల్డ్ మోడల్ కీప్యాడ్ ఫోన్‌లా కనిపిస్తున్నప్పటికీ.. ఇది ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో 2.4-అంగుళాల QVGA కలర్ డిస్‌ప్లే, LED ఫ్లాష్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, కనెక్టివిటీ కోసం 4G VoLTE, బ్లూటూత్ 5.0, టైప్-సి (Type-C) USB ఛార్జింగ్ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అందించారు. అలాగే 1,450 mAh రిమూవబుల్ బ్యాటరీని కూడా ఇందులో అమర్చారు.
అంతేకాదు, అప్పట్లో ఈ ఫోన్‌లో బాగా ఫేమస్ అయిన ‘స్నేక్ గేమ్’ను కూడా ఈ కొత్త మోడల్‌లో మళ్లీ తీసుకొచ్చారు. ఈ గేమ్‌తో వినియోగదారులు ఒక్కసారిగా తమ పాత జ్ఞాపకాల్లోకి వెళ్తారు. దీనిని కేవలం పాతకాలపు డిజైన్ ఫోన్‌గానే కాకుండా, ఒక అత్యుత్తమ బ్యాకప్ ఫోన్‌గా HMD తీర్చిదిద్దింది.
ధర, కలర్స్
ఇక ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 64 MB RAM, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఎస్‌డీ (SD) కార్డు ఆప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాదు క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేసి, ఈ ఫోన్ ద్వారా యూపీఐ (UPI) చెల్లింపులు కూడా చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లకు కాస్త దూరంగా ఉండాలనుకునే వారికి, స్టూడెంట్స్‌కు, బ్యాకప్ ఫోన్ వాడుకోవాలని అనుకునే వారికి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. HMD ఈ ఫోన్‌ను స్కూబా బ్లూ, గ్రంజ్ బ్లాక్, Y2K గోల్డ్ అనే మూడు కలర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇక ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధరను రూ. 4,299గా నిర్ణయించారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.