
సూపర్‌బైక్ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హయబుసా ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. కొత్త స్పెషల్ ఎడిషన్‌లో ఇంజిన్‌ను మార్చకపోయినా, బైక్ రూపంలో పలు మార్పులు చేశారు. మరోవైపు సాధారణ హయబుసాను కూడా కొత్త రంగులు, ఎలక్ట్రానిక్ అప్‌డేట్స్‌తో కంపెనీ తాజాగా తీసుకొచ్చింది. ధరలోనూ స్వల్ప మార్పు చేసింది.
హయబుసా స్పెషల్ ఎడిషన్ ధర రూ.19.90 లక్షలు. స్టాండర్డ్ హయబుసా ధర రూ.18.99 లక్షలు. అంటే స్పెషల్ ఎడిషన్ కోసం సుమారు రూ.91,000 అదనంగా చెల్లించాలి. ఈ అదనపు మొత్తానికి ప్రత్యేక డిజైన్, యాక్సెసరీలు, కొత్త ఫినిషింగ్ వంటి మార్పులు లభిస్తాయి.
పెర్ల్ విగోర్ బ్లూ రంగులో మాత్రమే స్పెషల్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక డీకాల్స్, కొత్త వీల్ ఫినిష్, 3D సుజుకి ఎంబ్లమ్, ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ ఇందులో ఉన్నాయి. మఫ్లర్ ఎండ్, హీట్ గార్డ్‌లకు అనోడైజ్డ్ ఫినిష్ ఇచ్చారు. సింగిల్ సీట్ కౌల్‌ను కూడా స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీంతో సాధారణ మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. స్పెషల్ ఎడిషన్‌తో పాటు స్టాండర్డ్ హయబుసాను కూడా మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్లతో అప్‌డేట్ చేశారు. కొత్త రంగులతో పాటు దీని ధరను రూ.18.99 లక్షలకు పెంచారు.
స్పెషల్ ఎడిషన్‌లో ఎలాంటి కీలకమైన మెకానికల్ మార్పులు చేయలేదు. ఇందులో 1,340cc, లిక్విడ్ కూల్డ్, DOHC ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 190 bhp పవర్, 142 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. 2026 హయబుసా రేంజ్‌లో కొత్త ELIIY పవర్ లిథియం అయాన్ బ్యాటరీని తీసుకురావడం మరో మార్పు. పాత బ్యాటరీతో పోలిస్తే ఇది తేలికగా, కాంపాక్ట్‌గా ఉంటుందని సుజుకి చెబుతోంది. లోడ్ ఉన్న సమయంలో వోల్టేజ్ స్థిరంగా ఉండేలా దీనిని రూపొందించారు.
గేర్ మార్చే సమయంలోనూ క్రూయిజ్ కంట్రోల్ యాక్టివ్‌గా ఉండేలా సిస్టమ్‌ను మెరుగుపరిచారు. ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, వివిధ రైడింగ్ మోడ్‌లు, హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాబట్టి స్పెషల్ ఎడిషన్‌లో ప్రధాన మార్పులు పవర్ కంటే లుక్, ఫినిషింగ్, ఎలక్ట్రానిక్ ఫీచర్ల చుట్టూనే ఉన్నాయి.