రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్

రోజూ కార్యాలయాలకు వెళ్లేవారికైనా, తరచుగా ప్రయాణాలు చేసేవారికైనా మొబైల్, స్మార్ట్‌వాచ్‌లను ఛార్జ్ చేసుకోవడం పెద్ద ప్రయాసగా మారుతోంది. రకరకాల కేబుళ్లు, ఛార్జర్లు వెంట పట్టుకెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్టఫ్‌కూల్ సరికొత్త పవర్‌బ్యాంక్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.

రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్
Stuffcool Omni Pro Power Bank

Updated on: Jul 30, 2026 | 8:20 PM

స్టఫ్‌కూల్ సరికొత్త పవర్‌బ్యాంక్‌ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, చేతిలో పట్టుకోవడానికి అత్యంత అనువుగా రూపుదిద్దుకుంది. దీని బరువు కేవలం 214 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాపిల్ వాచ్ ఛార్జర్ గురించి. పవర్ బ్యాంక్ లోపల దాగి ఉండే ఈ ఛార్జింగ్ మాడ్యూల్, అవసరమైనప్పుడు బయటకు స్లైడ్ అవుతుంది. దీంతో వాచ్ కోసం ప్రత్యేకంగా కేబుల్స్ మోయాల్సిన పనిలేదు. అలాగే పవర్‌బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉందో తెలుసుకోవడానికి స్పష్టమైన డిజిటల్ డిస్‌ప్లేను కూడా అందించారు.

బిల్ట్-ఇన్ కిక్‌స్టాండ్

ఈ పవర్ బ్యాంక్ 25W క్యూఐ2.2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఐఫోన్లను కేవలం ముప్పై నిమిషాల్లో సగం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఒకవేళ వైర్ ద్వారా ఛార్జ్ చేయాలనుకుంటే, ఇందులో 35W టైప్-సి పవర్ డెలివరీ పోర్ట్ ఉంది. ఇది శాంసంగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా చక్కగా పనిచేస్తుంది. ఐఫోన్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్.. ఇలా అన్నిటినీ ఒకే సమయంలో ఛార్జ్ చేసుకునే వెసులుబాటు దీని సొంతం.

ఇందులో మరో అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ బిల్ట్-ఇన్ కిక్‌స్టాండ్. ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఫోన్‌ను నిలువుగా లేదా అడ్డంగా నిలబెట్టుకోవచ్చు. వీడియో కాల్స్ మాట్లాడటానికి, సినిమాలు చూడటానికి, ఐఫోన్ స్టాండ్‌బై మోడ్ ఉపయోగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతీయ ప్రమాణ సంస్థ నుంచి ధృవీకరణ పొందిన ఈ డివైజ్ ఎంతో సురక్షితమైనది.

లభ్యత వివరాలు

భారతదేశంలోనే తయారైన ఈ సర్టిఫైడ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ. 4,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం అమెజాన్, స్టఫ్‌కూల్ అధికారిక వెబ్‌సైట్లలో రూ. 4,750 ప్రాథమిక ధరకే ఇది లభిస్తోంది. వివిధ బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఇంకా కాస్త తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఒకే పరికరంతో అన్ని రకాల గ్యాడ్జెట్లను సులభంగా ఛార్జ్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ఈ పవర్ బ్యాంక్ కచ్చితంగా నచ్చుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us