
సోషల్ మీడియా దిగ్గజం మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, యాప్‌లను వ్యసనంగా మార్చే ఫీచర్లపై కొత్త ఆంక్షలు విధించింది. అమెరికాలో దాఖలైన కేసులను పరిష్కరించేందుకు మెటా భారీ సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. దాదాపు 48 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ఇతర అమెరికా ప్రాంతాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం మెటా 17.1 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే తుది అమలుకు కోర్టు ఆమోదం అవసరం.
ఈ ఒప్పందంలో భాగంగా Instagram, Facebookలో 18 ఏళ్లలోపు వినియోగదారులకు పలు కఠినమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిపి రోజుకు గరిష్ఠంగా రెండు గంటల వినియోగ పరిమితి ఉంటుంది. ఈ పరిమితిని అధిగమించాలంటే తల్లిదండ్రుల అనుమతి అవసరం. అలాగే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టీనేజర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీడ్, స్టోరీస్, ఎక్స్‌ప్లోర్, రీల్స్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయలేరు.
స్కూల్ టైమ్‌లో నోటిఫికేషన్లు బంద్
పాఠశాల సమయాల్లో కూడా Instagram, Facebook వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోనున్నారు. పాఠశాల సమయంలో వారం రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు డిఫాల్ట్‌గా మ్యూట్ అవుతాయి. అయితే డైరెక్ట్ మెసేజ్‌లు, అకౌంట్ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అలర్ట్లు మాత్రం అందుతాయి.
15 నిమిషాలకోసారి రిమైండర్
టీనేజర్లు నిరంతరం స్క్రోల్ చేయకుండా ఉండేందుకు మెటా ‘Productive Pauses’ పేరుతో విరామ రిమైండర్లను కూడా తీసుకురానుంది. 15 నిమిషాల నిరంతర వినియోగం తర్వాత, అలాగే రోజువారీ వినియోగం 60, 90 నిమిషాలకు చేరుకున్నప్పుడు రిమైండర్లు కనిపిస్తాయి.
వయస్సు నిర్ధారణ మరింత కఠినం
18 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించేందుకు మెటా మరింత బలమైన Age Assurance విధానాలను అమలు చేయనుంది. పిల్లలకు అనుచితమైన కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, ఈటింగ్ డిజార్డర్స్, ఆత్మహత్య, స్వీయహానిని ప్రోత్సహించే కంటెంట్ నుంచి రక్షణ కల్పించేలా భద్రతా నియంత్రణలను కూడా కఠినతరం చేయనుంది. పిల్లల పోస్టులపై కనిపించే లైక్స్, రియాక్షన్ కౌంట్లు వంటి కొన్ని ఫీచర్లను కూడా పరిమితం చేయనుంది.
YouTube, TikTokకు కూడా మెటా పిలుపు
ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఇదే తరహా నియంత్రణలు లేకపోతే పిల్లలు ఒక యాప్ నుంచి మరో యాప్‌కు మారే అవకాశం ఉందని మెటా చెబుతోంది. అందుకే YouTube, TikTok, Snapchat వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని కోరింది. ఈ సంస్థలు అంగీకరించినట్లయితే సెటిల్‌మెంట్‌లోని అదనపు మొత్తంతో పాటు మరింత కఠినమైన వినియోగ పరిమితులు అమల్లోకి వచ్చేలా ఒప్పందంలో నిబంధనలు ఉన్నాయి.
మెటా తప్పు ఒప్పుకుందా?
ఈ సెటిల్‌మెంట్‌లో మెటా ఎలాంటి తప్పు, చట్టపరమైన బాధ్యతను అంగీకరించలేదు. అయితే పిల్లల భద్రత కోసం తమ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ మార్పులు చేసేందుకు అంగీకరించింది. ఈ కేసులో మెటా సుమారు 10 బిలియన్ డాలర్ల చార్జ్‌ను ప్రస్తుత త్రైమాసికంలో నమోదు చేయనున్నట్లు వెల్లడించింది.
భారత్‌పై ప్రభావం ఉంటుందా?
ప్రస్తుతం ఇది అమెరికాలో కుదిరిన సెటిల్‌మెంట్ కావడంతో భారతదేశంలో నేరుగా ఇదే నిబంధనలు అమల్లోకి రావు. అయితే పిల్లల ఆన్‌లైన్ భద్రత, వయస్సు నిర్ధారణ, తల్లిదండ్రుల నియంత్రణలు, స్క్రీన్ టైమ్ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా Instagram, Facebook వంటి ప్లాట్‌ఫారమ్‌లు భారత మార్కెట్లో టీనేజర్ల కోసం భవిష్యత్తులో ఇలాంటి ఫీచర్లను ప్రవేశపెడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ఒప్పందం కోర్టు తుది ఆమోదానికి లోబడి ఉంది. ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధనల అమలు ప్రారంభమవుతుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..