
కొత్త ఫోన్‌కు సంబంధించిన సమాచారం అధికారికంగా బయటకు రాకముందే లీక్ అయితే ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు హువావే మేట్ 90 విషయంలోనూ ఇదే జరిగింది. లాంచ్ పోస్టర్‌తో పాటు ఫోన్ లైవ్ ఫోటోలు కూడా నెట్‌లో కనిపించాయి. గ్రీన్ కలర్, పెద్ద గుండ్రటి కెమెరా మాడ్యూల్‌తో కనిపిస్తున్న ఈ ఫోన్ డిజైన్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
హువావే చైనా వెబ్‌సైట్‌లో పొరపాటున కనిపించిన పోస్టర్ ప్రకారం మేట్ 90 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 1వ తేదీన విడుదల కానున్నాయి. అధికారికంగా వెల్లడించాల్సిన సమాచారం ముందుగానే బయటకు రావడంతో కంపెనీ ఆ పేజీని తొలగించింది. అయితే అప్పటికే పోస్టర్ సోషల్ మీడియాలోకి చేరిపోయింది.
పోస్టర్‌లో కనిపిస్తున్న అర్ధచంద్రాకార రింగ్ డిజైన్ ఫోన్ వెనుక భాగంలో పెద్ద గుండ్రటి కెమెరా మాడ్యూల్ ఉండొచ్చనే సంకేతాలను ఇస్తోంది. ఈసారి సరికొత్త గ్రీన్ కలర్ వేరియంట్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ రంగు ఫోన్‌కు ప్రీమియమ్ లుక్ అందిస్తోంది.
పోస్టర్ లీక్ అయిన కొద్దిసేపటికే మేట్ 90కు సంబంధించిన లైవ్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో బ్రైట్ గ్రీన్ కలర్ మోడల్ కనిపించింది. వెనుక ప్యానెల్‌ను రెండు భాగాలుగా రూపొందించారు. పైభాగంలో నిలువు, అడ్డ గీతలతో లేత అల్లికలా కనిపించే డిజైన్ ఇచ్చారు. కాంతి పడినప్పుడు ఇది విభిన్న షేడ్స్‌లో మెరుస్తుంది. కింది భాగం సాదాగా ఉండటంతో పాటు మెటాలిక్ హువావే లోగో కనిపిస్తోంది.
వెనుక వైపు పెద్ద గుండ్రటి కెమెరా మాడ్యూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చుట్టూ మెరిసే అంచు ఉండగా, లోపల మూడు కెమెరా లెన్స్‌లు కనిపిస్తున్నాయి. మధ్యలో హువావే సొంత XMAGE బ్రాండింగ్ ఉంది. కెమెరా పైన గజర్ ఆటోఫోకస్ సెన్సార్, కింద ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌ను అమర్చినట్లు లీకైన ఫోటోలు సూచిస్తున్నాయి. సైడ్ ఫ్రేమ్‌కు గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడంతో ఫోన్‌కు లగ్జరీ లుక్ వచ్చింది.
గ్రీన్ మోడల్‌తో పాటు మేట్ 90 ఆర్‌ఎస్ అల్టిమేట్ మోడల్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది రెడ్ సెరామిక్ బ్యాక్ ప్యానెల్‌తో డ్యూయల్ టోన్ డిజైన్‌లో కనిపిస్తోంది. సిరీస్‌లో పలు మోడల్స్ రానున్నట్లు సమాచారం. కెమెరా విభాగంలోనూ మార్పులు ఉండొచ్చని, కొత్త టెలిఫోటో యాక్సెసరీ సాంకేతికతతో ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది.