ప్రస్తుతం ఫోన్ లేని వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డ్యూయల్ సిమ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రెండు సిమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిమ్ కార్డుల ద్వారా నేరాలు కూడా జరుగుతున్నాయి. మనకు తెలియ కుండానే మన పేరుపై కొందరు నేరస్తులు సిమ్ కార్డులను తీసుకుంటున్న ఉదాంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరి మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్‌లో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఒక ఐడీ ప్రూఫ్‌పై 9 సిమ్ కార్డులను తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయో తెలుసుకోవడానికి కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..
* ఇందుకోసం ముందుగా TAFCOP పోర్టల్ tafcop.sancharsaathi.gov.inకి వెళ్లాలి. అనంతరం వెబ్‌సైట్‌లో కనిపించే బాక్సులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* వెంటనే మీ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* అనంతరం స్క్రీన్‌పై మీ ఐడీ నుంచి యాక్టివ్‌లో ఉన్న ఫోన్ నెంబర్లకు కనిపిస్తాయి.
* ఒకవేళ అందులో మీకు సంబంధించిన నెంబర్ లేకపోతే.. మీ నెంబర్ కాదని ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తే మీ నెంబర్‌ను ఆధార్ కార్డు నుంచి తొలగిస్తారు.
TAFCOP పోర్టల్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రన్ చేస్తుంది. ఈ పోర్టల్ మొబైల్ కనెక్షన్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. మీ ఆధార్ కార్డు ద్వారా ఎన్ని మొబైల్ నెంబర్లు యాక్టివ్‌లో ఉన్నాయి.? ఏయే నెంబర్స్ యాక్టివ్‌లో ఉన్నాయి లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా మీ ఐడీతో ఎవరైనా సిమ్‌ను ఉపయోగిస్తుంటే ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఐడిపై ఉన్న సిమ్ కార్డు నుంచి ఏదైనా నేరం జరిగితే దానికి మీరే బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..