
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్‌ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో మనుషులకు ఆధార్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు పత్రాలు ఉన్నట్లే, హ్యూమనాయిడ్ రోబోట్‌లకు కూడా ప్రత్యేక డిజిటల్ గుర్తింపు వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ మేరకు ‘హ్యూమనాయిడ్ ఫుల్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ సర్వీస్ ప్లాట్‌ఫామ్’ పేరుతో జాతీయ స్థాయి డిజిటల్ ఐడీ వ్యవస్థను ప్రారంభించింది.
ఈ కొత్త విధానం కింద చైనాలో తయారయ్యే ప్రతి హ్యూమనాయిడ్ రోబోట్‌కు 29 అంకెల ప్రత్యేక గుర్తింపు కోడ్ కేటాయించబడుతుంది. ఈ కోడ్ రోబోట్‌కు డిజిటల్ పాస్‌పోర్ట్‌లా పనిచేస్తూ, దాని తయారీ నుంచి అమ్మకాలు, వినియోగం, నిర్వహణ, రీసైక్లింగ్, చివరికి విరమణ వరకు మొత్తం జీవితచక్రాన్ని నమోదు చేస్తుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలవుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గుర్తింపు వ్యవస్థ ద్వారా రోబోట్‌ను ఎవరు తయారు చేశారు, ఏ మోడల్‌కు చెందినది, ఎక్కడ వినియోగిస్తున్నారు, నిర్వహణ చరిత్ర ఏమిటి వంటి వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. దీంతో భద్రతాపరమైన సమస్యలను గుర్తించడం, లోపభూయిష్ట ఉత్పత్తులను వెనక్కి పిలిపించడం, బాధ్యతను నిర్ధారించడం మరింత సులభమవుతుంది.
29 అంకెల కోడ్‌లో దేశ కోడ్, తయారీదారు కోడ్, ఉత్పత్తి మోడల్ కోడ్, ప్రత్యేక సీరియల్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. ఈ వ్యవస్థను రోబోట్ తయారీదారులు, విక్రేతలు, సేవా సంస్థలు, వినియోగదారులు, రీసైక్లింగ్ కంపెనీలు అందరూ అనుసరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోడ్ లేకపోతే మార్కెట్ యాక్సెస్ లేదు అనే కఠిన నిబంధనను కూడా చైనా అమలు చేయనుంది. అంటే డిజిటల్ ఐడీ లేని హ్యూమనాయిడ్ రోబోట్‌లను దేశంలో విక్రయించడం లేదా వినియోగించడం సాధ్యం కాదు. ఇప్పటికే 100కు పైగా చైనా రోబోట్ తయారీ సంస్థలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో చేరగా, 200కు పైగా మోడళ్లకు చెందిన 28 వేలకుపైగా హ్యూమనాయిడ్ రోబోట్‌లకు డిజిటల్ గుర్తింపులు జారీ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. AI ఆధారిత యంత్రాల నియంత్రణ, భద్రత, పారదర్శకతలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి