
నడివేసవిలో ప్రయాణాలు చేసే వారికి ఈ మినీ కూల్ ఫ్యాన్ ఒక చల్లని నేస్తంలా పనిచేస్తుంది. మెడలో వేలాడదీసుకునే వీలుండటం వల్ల చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అత్యాధునిక సాంకేతికత, శక్తిమంతమైన బ్యాటరీతో రూపొందిన ఈ ఫ్యాన్ వేసవి తాపాన్ని ఎలా దూరం చేస్తుందో, ఇందులో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏమిటో చూద్దాం.
ఈ డైసన్ హష్‌జెట్ మినీ కూల్ ఫ్యాన్ కేవలం 212 గ్రాముల బరువుతో ఎంతో తేలికగా ఉంటుంది. దీనిని సులభంగా మెడలో వేలాడదీసుకోవచ్చు. ఇందులో అమర్చిన 65,000 ఆర్పీఎం (RPM) బ్రష్‌లెస్ డీసీ మోటార్ గంటకు 25 మీటర్ల వేగంతో చల్లని గాలిని అందిస్తుంది. ఈ మినీ ఫ్యాన్‌లో ఉపయోగించిన ఎయిర్ మల్టిప్లైయర్ టెక్నాలజీ దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇది చుట్టూ ఉన్న గాలిని గ్రహించి, మరింత శక్తిమంతమైన ఎయిర్‌ఫ్లోను మనకు అందిస్తుంది. దీనివల్ల సాధారణ ఫ్యాన్ కంటే ఇది ఎంతో చల్లటి అనుభూతిని ఇస్తుంది.
ఈ బుల్లి ఫ్యాన్‌లో 5,000 ఎంఏహెచ్ (mAh) బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఆరు గంటల పాటు నిరంతరాయంగా చల్లని గాలిని అందిస్తుంది. యూఎస్‌బీ-సి (USB-C) కేబుల్ ద్వారా కేవలం మూడు గంటల్లోనే దీని బ్యాటరీ పూర్తిగా రీచార్జ్ అవుతుంది. ఇందులో మొత్తం ఆరు రకాల స్పీడ్ కంట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎండలో ప్రయాణించి వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం ఇందులో ఉన్న ‘బూస్ట్ మోడ్’ను ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక్క నిమిషంలోనే శరీరాన్ని చల్లబరుస్తుంది.
డైసన్ కంపెనీ తన ప్రత్యేకమైన బ్లేడ్‌లెస్ డిజైన్‌కు పేరుగాంచింది. ఈ మినీ ఫ్యాన్‌లో కూడా ఎలాంటి రెక్కలు బయటకు కనిపించవు. దీనివల్ల చిన్న పిల్లలు కూడా దీనిని ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా వాడుకోవచ్చు. అలాగే డైసన్ ఫ్యాన్లు చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. ఈ మినీ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు కేవలం 52 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే చేస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు దీనివల్ల ఎలాంటి చికాకు ఉండదు. ఎన్నో ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్న ఈ ‘హష్‌జెట్ మినీ కూల్ ఫ్యాన్’ ధర రూ.12,200. వేసవిలో ఎండల నుండి తప్పించుకోవాలనుకునే వారికి ఇది అన్ని ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది.