
ఎన్నో ఏళ్లుగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త పరిణామం త్వరలోనే నిజం కానుందా? ఐఫోన్ సంప్రదాయ రూపురేఖలను సమూలంగా మారుస్తూ యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుందా అంటే.. టెక్ వర్గాల నుంచి అవును అనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 9న జరగనున్న యాపిల్ వార్షిక మెగా ఈవెంట్ సర్ప్రైజ్ అండ్ షైన్ వేదికగా ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు ఈ సంచలన ఐఫోన్ ఫోల్డ్‌ను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. యాపిల్ తొలి ఫోల్డబుల్ డివైజ్ బుక్ స్టైల్ రూపంలో ఉండనుంది. మడతపెట్టినప్పుడు సాధారణ పాస్‌పోర్ట్ పరిమాణంలో చేతిలో ఒదిగిపోతుంది. పూర్తిగా తెరిచినప్పుడు దాదాపు 7.8 అంగుళాల అంతర్గత స్క్రీన్‌తో ఒక చిన్న ఐప్యాడ్‌లా మారిపోయి, మల్టీటాస్కింగ్, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలో స్క్రీన్ మడతపడే చోట గీత స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే యాపిల్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా దాదాపు క్రీజ్ కనిపించని ప్రత్యేక డిస్‌ప్లేపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసింది. తెరపై మడత కనిపించకుండా చేయడమే కాకుండా వేలసార్లు తెరిచినా తట్టుకునే అత్యంత దృఢమైన హింజ్ రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ కారణం వల్లే శామ్‌సంగ్, గూగుల్ వంటి సంస్థల కంటే ఆలస్యంగా యాపిల్ ఫోల్డబుల్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఫోల్డ్ చేసినప్పుడు ఫోన్ మరీ లావుగా కాకుండా అత్యంత సన్నగా ఉండేలా యాపిల్ ప్లాన్ చేస్తోంది. అయితే, ఫోన్ మందం తగ్గించే క్రమంలో కొన్ని సాంకేతిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
టచ్ ఐడీ రీ-ఎంట్రీ?: సన్నని బెజెల్స్ కారణంగా ఫేస్ ఐడీ సెన్సార్ల స్థానంలో పవర్ బటన్‌లోనే టచ్ ఐడీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
కెమెరా మాడ్యూల్: ప్రో సిరీస్ తరహాలో భారీ కెమెరా సెటప్ కాకుండా, స్లిమ్ బాడీకి అనుగుణంగా కాంపాక్ట్ కెమెరా సెటప్‌ను అందించవచ్చని అంచనా.
యాపిల్ లైనప్‌లోనే ఇది అత్యంత ఖరీదైన అల్ట్రా ప్రీమియం డివైజ్‌గా నిలవనుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు సుమారు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న ఐఫోన్ మోడళ్ల స్థానాన్ని భర్తీ చేయకుండా ప్రో మ్యాక్స్ కంటే పైన సరికొత్త సూపర్ ప్రీమియం కేటగిరీగా మార్కెట్లోకి రానుంది.
యాపిల్ ఇప్పటివరకు దీని పేరు, స్పెసిఫికేషన్లు, ధరలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సెప్టెంబర్ 9న ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తున్నప్పటికీ, ఉత్పత్తి సవాళ్ల దృష్ట్యా మార్కెట్‌లోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. హోమ్ బటన్ తొలగించిన తర్వాత ఐఫోన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద డిజైన్ మార్పుగా నిలవనుండటంతో గ్లోబల్ టెక్ ప్రపంచం సెప్టెంబర్ 9 ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.