Air Conditioner: వేసవిలో ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే..

వేసవికాలం కావడంతో ఇళ్లల్లో ఏసీల వినియోగం అనేది పెరిగిపోతుంది. అయితే ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల వేడెక్కి మంటలు రాావడం, అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. అయితే వేసవిలో ఏసీ వాడకంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Air Conditioner: వేసవిలో ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే..
Air Conditioner

Updated on: May 29, 2026 | 1:16 PM

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ మండుతూ సెగలు కక్కుతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఉక్కబోత, ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఇళ్లల్లో ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వేసవికాలంలో ఏసీ వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏసీ లేనివారు కూడా దీనిని తీసుకుంటున్నారు. దీంతో ఏసీ కొనుగోళ్లు కూడా పెరిగిపోయాయి. అయితే కొంతమంది తెలియక ఎక్కువ గంటలు ఏసీని ఆన్ చేసి ఉంచుతారు. అయితే ఇటీవల ఏసీ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల వేసవికాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఏసీలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీని వల్ల 9 మంది మరణించారు. అయితే ఏసీలో మంటలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే..

సమ్మర్‌లో ఏసీని ఎక్కువ గంటల పాటు ఉపయోగిస్తారు. దీని వల్ల వేడెక్కుతుంది. ఇలాంటప్పుడు వైరింగ్ బలహీనంగా ఉండటం, ఫిల్టర్లు మురికిగా ఉండటం, వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఏసీ నుంచి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఫిల్టర్లు మురికిగా ఉన్నప్పుడు గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల కంప్రెసర్ మరింతగా కష్టపడి పనిచేయడం వల్ల అది వేడెక్కుతుంది. అలాగే వోల్టేజ్‌లోని హెచ్చుతగ్గులు కంప్రెసర్, ఇతర విద్యుత్ భాగాలను దెబ్బతీస్తాయి. ఒక్కసారిగా వోల్టేజ్ పెరగడం లేదా తగ్గడం వల్ల కంప్రెసర్, ఇతర వైర్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతింటాయి. అలాగే వదులుగా ఉన్న కనెక్షన్లు, పగిలిన ఇన్సులేషన్ వంటి వాటి వల్ల మరింత ప్రమాదం ఏర్పడుతంది. ఇక రిఫ్రిజెరెంట్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కూలింగ్ తగ్గి ఏసీ పనిచేసేందుకు మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటప్పుడు వేడెక్కడం వల్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే..?

-వేసవికి ముందే ఏసీని సర్వీసింగ్ చేయించుకోండి

-ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి

-వోల్టేజ్ స్టెబిలైజర్, సర్ట్ ప్రొటెక్టర్ ఉపయోగించండి

-ఏసీని నిరంతరం వాడకండి.. మధ్యలో గ్యాప్ ఇవ్వండి

-బుసకొట్టే శబ్దాలు, బలహీనమైన శీతలీకరణ, కాయిల్స్‌పై మంచు, వెంట్ల నుండి వచ్చే వేడి గాలి వంటి వాటిని గమనించండి

-ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లలో పనిచేసే పొగ డిటెక్టర్లు, అగ్నిమాపక పరికరాలు, తెరిచి ఉన్న మెట్లు, తాళం వేయని టెర్రస్ నిష్క్రమణ మార్గాలు ఉండాలి

Follow Us