నీరజ్ చోప్రాకి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. హర్యానాలో పుట్టిన ఈ తురుపు ముక్కు ఇప్పుడు దేశాన్ని విను వీధుల్లో నిలిపాడు. విశ్వ వేదికపై తిరంగాను రెపరెపలాడించాడు. చరిత్ర తిరగ రాసి.. వందేళ్ల ఎదురు చూపులకు ఫలితాన్ని అందించిన మన గోల్డెన్ చోప్రా విజయ ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది.. విజయ యాత్ర బీజం ఎక్కడ పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 23 ఏళ్ల నీరజ్.. జావెలిన్ చేతబట్టి పరుగెడుతుంటే.. ప్రత్యర్ధుల గుండెల్లో వణుకుపుట్టింది. ఏకంగా 87 మీటర్లు విసిరి.. ఇదీ నా సత్తా దమ్ముంటే.. నన్ను దాటి వేయండి అంటూ సవాల్ విసిరాడు. కానీ ఎవరూ.. మన నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు.
అడుగుపెట్టిన తొలి ఒలింపిక్స్ లోనే భారత పథకాన్ని రెపరెపలాడించాడు. హర్యానాలోని పానీపట్ జిల్లాలో పుట్టిన నీరజ్ విజయ ప్రస్తానం 2016లోనే మొదలైంది. కాంద్రా అనే గ్రామంలో 24 డిసెంబర్ 1997లో చోప్రా జన్మించాడు. అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవాళ్లే. చిన్నతనంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దీంతో 12 ఏళ్లకే 90కిలోల బరువు పెరిగాడు. ఇంట్లో వాళ్లు కసరత్తుతలు చేయమన్నా నో చెప్పేవాడు. ఫిట్‌నెస్ గురించి అసలు ఆలోచించేవాడు కాదు. కుటుంబం బలవంతం చేయడంతో ఓసారి నీరవ్ స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడే అతడికి జావలిన్ త్రో ప్లేయర్ జై చౌధరీ తారసపడ్డాడు. జావెలిన్ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే భారీకాయంతో కూడా నీరవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడట. ఆట గురించి ఏం తెలియకపోయినా తొలిసారే 35-40మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడని.. అది ఎంతో గొప్ప విషయమని జై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జై చౌధరీ ఏ క్షణాన జావెలిన్‌ను నీరజ్ చేతికి ఇచ్చాడో తెలియదు గానీ.. ఆ ఆటపై నీరజ్‌కు ఆసక్తి పెరిగింది. జావెలిన్‌లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఒకవైపు ట్రైనింగ్ కొనసాగిస్తూనే.. మరోవైపు చదువును కొనసాగించి ఆర్మీలో చేరాడు.
2016లో నాయబ్ సుబేదార్ గా భారత సైన్యంలో ఉద్యోగం సంపాదించాడు. పుట్టినప్పటి నుంచీ ఉన్న ఇంట్రస్ట్ తో గేమ్స్ ను ఏ మాత్రం అశ్రద్ధ చేయలేదు. జావెలిన్ త్రోలో మెళకువలు నేర్చుకుంటూ.. అసాధారణ ప్రతిభా వంతుడయ్యాడు. ఫిబ్రవరి 2016 గువాహటిలో జరిగిన సౌథ్ ఆసియన్ గేమ్స్ లో తొలిసారి పోటీల్లో పాల్గొనడమే కాకుండా.. పథకాన్ని ఎగరేశాడు. తొలి ఎంట్రీలోనే గోల్డ్ కొట్టి.. మువ్వన్నెల పథకాన్ని రెపరెపలాడించాడు. అక్కడ మొదలైన నీరజ్ జయభేరీ.. ఇప్పుడు టోక్యోలో స్వర్ణ పథకం వరకు మోగుతూనే ఉంది. జూన్ 2016 వియత్నాంలో జరిగిన ఆసియన్ జూనియర్ చాంపియన్ షిప్స్ లో రజతం.. 2016 జులై, పోలండ్ లో జరిగిన IAAF వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 చాంపియన్ షిప్స్ లో స్వర్ణం సాధించాడు.
2016 రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలం అయ్యాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మొక్కవోని సంకల్పంతో.. ముందుకు సాగాడు. 2017 జులైలో, ఒడిశాలో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో స్వర్ణం.. 2018 ఏప్రిల్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణ పథకాన్నే ముద్దాడాడు. 2018 దోహ డైమండ్ లీగ్ పోటీల్లో 87.43 మీటర్ల దూరం జావెలిన్ విసిరి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. 2018లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా గేమ్స్ లో 88.06 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. దేశానికి అనేక కీర్తి పతాకలు తీసుకొచ్చిన నీరజ్ కు.. 2018లో అర్జున అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించి.. సువర్ణ పథకాన్ని ఎగరేశాడు. 127 మంది క్రీడాకారులు .. దేశం నుంచి టోక్యోకు బయలుదేరారు. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు పథకాలు తెస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ చాలా మంది నిరాశపర్చారు. నీరజ్ చోప్రా ఒక్కడే.. ఒకే ఒక్కడై.. డైనమైట్ లా మెరిసి.. గోల్డెన్ చోప్రాగా మారాడు. దేశానికి ఇంత కీర్తి పతాక తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రాను దేశం అభినందిస్తోంది. టీవీ 9 తెలుగు కూడా సవినయంగా సత్కరిస్తోంది. జయహో భారత్.. జయహో నీరజ్.
Also Read: సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే