Pro Kabaddi: మెరిసిన యూ ముంబా.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం

|

Nov 01, 2024 | 6:33 PM

మాజీ చాంపియన్ల పోరులో యూ ముంబా పైచేయి సాధించింది. 39-37తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై రెండు పాయింట్ల తేడాతో యూ ముంబా మెరుపు విజయం సాధించింది. గురువారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో..

Pro Kabaddi: మెరిసిన యూ ముంబా.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం
U Mumba Beats Jaipur Pink Panthers
Follow us on

హైదరాబాద్‌, 31 అక్టోబర్‌ 2024 : మాజీ చాంపియన్ల పోరులో యూ ముంబా పైచేయి సాధించింది. 39-37తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై రెండు పాయింట్ల తేడాతో యూ ముంబా మెరుపు విజయం సాధించింది. గురువారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో యూ ముంబా రెయిడర్‌ అజిత్‌ చౌహాన్‌ (14 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో అదరగొట్టడంతో ఆ జట్టు పీకెఎల్‌ 11వ సీజన్లో రెండో విజయం సాధించింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తరఫున నీరజ్‌ నర్వాల్‌ (12 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి.

ఆద్యంతం హోరాహోరీ :

యూ ముంబా, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మ్యాచ్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇటు జైపూర్‌, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు కొల్లగొట్టారు. పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ప్రథమార్థం చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఆలౌట్‌ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రథమార్థం ఆటలో యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడింగ్‌లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్‌లో యూ ముంబా ఐదు, జైపూర్‌ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.

ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను వెంబడించింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్‌ నర్వాల్‌ సూపర్‌ రెయిడ్‌తో 32-32తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ స్కోరు సమం చేసింది. కానీ ఆ తర్వాతి రెయిడ్‌లోనే రోహిత్‌ రాఘవ్‌ సూపర్‌ రెయిడ్‌తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా సీజన్లో రెండో విజయం సాధించింది.