మరో ఐసీసీ టోర్నీ భారత్ చేజారింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో యువ భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. టోర్నమెంట్ అంతటా వరుస విజయాలతో ఫైనల్స్‌కు దూసుకొచ్చిన మన కుర్రాళ్లు.. తుది పోరులో మాత్రం చతికిలపడ్డారు. కంగారూల పేస్ బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్‌లో భారత కుర్రాళ్లు కేవలం 174 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఓటమి కారణం మనోడే.. ఆస్ట్రేలియా జట్టులోని భారత సంతతి ప్లేయర్ ఒకడు.. టీమిండియాను తుది మెట్టులో గట్టి దెబ్బ తీశాడు. మరి ఇంతకీ అతడెవరో ఇప్పుడు చూద్దామా..
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.. భారత సంతతికి చెందిన హర్జాస్ సింగ్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ హ్యారీ డిక్సన్(42), కెప్టెన్ హాగ్ వీబెన్(48) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఆఖర్లో ఓలీ పీక్ (46 నాటౌట్) జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు. అయితే టూ డౌన్‌లో వచ్చిన హర్జాస్ సింగ్(55) ఇన్నింగ్స్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. సరిగ్గా మిడిల్ ఓవర్లలో బరిలోకి దిగిన అతడు అటు డిక్సన్(42), అలాగే హిక్స్(20)తో కలిసి రెండు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఒకవైపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ.. మరో ఎండ్‌లో వెనువెంటనే వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే హార్జాస్ మొత్తంగా 64 బంతులు ఎదుర్కుని 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఒకవేళ హర్జాస్ మిడిల్ ఓవర్లలో తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరి ఉంటే.. ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడేది. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియాను పూర్తిగా డిఫెన్స్ మోడ్‌లో పడేశాడు.
వన్డేలలో ఎప్పుడూ మొదటి 10 ఓవర్లు.. అలాగే 20-40 మిడిల్ ఓవర్లే కీలకం. మొదటి 10 ఓవర్లలో టీమిండియా అధిపత్యం చూపిస్తే.. మిడిల్ ఓవర్లలో మాత్రం హర్జాస్ తన సత్తా చాటాడు. వికెట్లు పడకుండా తన జట్టుకు పరుగులు అందించి.. టీమిండియాకు గట్టి దెబ్బ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించగలిగింది. అలాగే చేజింగ్‌లో మన టీం చతికిలపడటంతో.. కప్ చేతుల్లో నుంచి చేజారింది. కాగా, ఫైనల్‌లో అదరగొట్టిన హర్జాస్ సింగ్‌కు భారత మూలాలు ఉన్నాయి. హర్జాస్ తండ్రి ఇంద్రజిత్ సింగ్ పంజాబ్ బాక్సింగ్ ఛాంపియన్.. అలాగే అతడి తల్లి లాంగ్ జంప్ అథ్లెట్ కావడం విశేషం. వీళ్లిద్దరూ 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఇక 2005లో సిడ్నీలో హర్జాస్ జన్మించాడు. అండర్ 19 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లలో హర్జాస్ సింగ్ పెద్దగా రాణించలేకపోయినా.. ఆఖరి ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 55 పరుగులు చేసి.. ఆస్ట్రేలియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
Australia get their hands on the #U19WorldCup trophy for the fourth time 😍 pic.twitter.com/L7Rj0G9qZH
— ICC (@ICC) February 11, 2024