Virat Kohli : 66ఏళ్లే బతుకుతాడట.. నవంబర్ 2025 తర్వాత అన్నీ కష్టాలేనట.. కోహ్లీ జాతకం చెప్పిన జ్యోతిష్కుడు
ఒక జ్యోతిష్కుడు విరాట్ కోహ్లీ జాతకంపై షాకింగ్ భవిష్యవాణి చేశాడు. నవంబర్ 2025 తర్వాత అతనికి చెడు సమయం మొదలవుతుందని, లండన్‌లో నివాసం అశుభమని, అతని జీవితం 66 ఏళ్లకు ముగిసిపోతుందని అంచనా వేశాడు. ఈ సంచలన ప్రకటన క్రికెట్ అభిమానులలో చర్చకు దారితీసింది.

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘకాలంగా తిరుగులేని రికార్డులు సృష్టిస్తూ, అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ జీవితంపై ఓ జ్యోతిష్కుడు చేసిన భవిష్యవాణి ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి ఇప్పటికే రిటైర్ అయి, లండన్‌లో తన కుటుంబంతో స్థిరపడిన విరాట్ జీవితంలో నవంబర్ 2025 తర్వాత కీలక మార్పులు చోటుచేసుకుంటాయని ఈ జ్యోతిష్కుడు అంచనా వేశాడు. ఈ అంచనాలు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాయి.
విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైం మొదలైందా ?
ఎస్ట్రో సుశీల్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడుదలైన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జ్యోతిష్కుడు సుశీల్ విరాట్ కోహ్లీ జాతకాన్ని విశ్లేషించి, అతనికి బ్యాడ్ టైం రాబోతోందని పేర్కొన్నాడు. “నేను విరాట్ కోహ్లీ జాతకాన్ని చూశాను. నాకు తెలిసినంతవరకు నవంబర్ 2025 తర్వాత అతని పతనం ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి అతని జీవితంలో అనేక ప్రతికూలతలు ఎదురుకావచ్చు” అని సుశీల్ స్పష్టం చేశాడు.
విరాట్ క్రికెట్ నుంచి ఎప్పుడు పూర్తిగా రిటైర్ అవుతాడనే విషయంపై అంచనా వేయడానికి నిరాకరించినప్పటికీ, అతని కెరీర్‌లోని కీలక ఘట్టాలు ముగిసి, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో సవాళ్లను ఎదుర్కోవచ్చని అతను సూచించాడు. “విరాట్ కోహ్లీకి ఇప్పుడు 36 ఏళ్లు. అతను తన కెరీర్ పీక్ స్టేజ్‌లో సంపాదించాల్సింది అంతా సంపాదించేశాడు. ఇకపై అతని జీవితం మరో దశలోకి ప్రవేశించనుంది” అని ఎస్ట్రో సుశీల్ అభిప్రాయపడ్డాడు.
కేవలం 66 ఏళ్లే జీవిస్తాడా?
విరాట్ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్‌లో స్థిరపడ్డాడు. ఈ విషయంపై కూడా ఎస్ట్రో సుశీల్ సంచలన భవిష్యవాణి చేశాడు. “విరాట్ లండన్‌లో స్థిరపడటం అతనికి అశుభం. ఈ మార్పు అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అతనికి చాలా తీవ్రమైన వ్యాధి రావొచ్చు” అని అతను హెచ్చరించాడు. అంతేకాకుండా, విరాట్ జీవితకాలంపై కూడా సుశీల్ దిగ్భ్రాంతికరమైన అంచనా వేశాడు. “విరాట్ జీవితంలో ఇప్పుడు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అతని జాతకం ప్రకారం.. విరాట్ వయసు 66 ఏళ్లు మాత్రమే కనిపిస్తోంది. 66 ఏళ్ల వద్ద అతని జీవిత గమనం ఆగిపోతుంది” అని ఎస్ట్రో సుశీల్ జోస్యం చెప్పాడు. ఈ అంచనా విరాట్ అభిమానులను, క్రికెట్ వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




