Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. కట్‌చేస్తే.. వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్..!

Vaibhav Sooryavanshi Captaincy Debut: కెప్టెన్‌గా అరంగేట్రంలో సత్తా చాటుతాడని అందరూ ఆశించిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి సౌరాష్ట్ర పేసర్ చేతన్ సకారియా షాకిచ్చాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2026 ఆరంభ మ్యాచ్‌లో బీహార్ బ్యాటింగ్‌ను సౌరాష్ట్ర తొలి ఓవర్లలోనే కుదిపేసింది.

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. కట్‌చేస్తే.. వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్..!
Vaibhav Sooryavanshi Captaincy Debut

Updated on: Nov 14, 2026 | 12:13 PM

Vaibhav Sooryavanshi Captaincy Debut: క్రికెట్‌లో కొన్ని క్షణాలు అనుభవానికి, ఆతృతకు మధ్య జరిగే పోరును తేల్చేస్తాయి. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2026లో బీహార్ వర్సెస్ సౌరాష్ట్ర మ్యాచ్‌లో సరిగ్గా అదే జరిగింది. టాస్ గెలిచిన యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం సరైందని నిరూపించుకోవాలన్న కసి, కెప్టెన్సీ అరంగేట్రంలో మెరువాలన్న ఒత్తిడి.. రెండింటి మధ్య 15 ఏళ్ల ఆటగాడు బరిలోకి దిగాడు. ప్రేక్షకుల కళ్లన్నీ అతనిపైనే. ఆరంభంలోనే బీహార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అలోక్ కృష్ణ కుమార్ పరుగుల కోసం తడుముకోవడంతో పెవిలియన్ చేరాడు. దీంతో ఒత్తిడి పూర్తిగా కెప్టెన్‌పై పడింది.

దీన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నంలో వైభవ్ తనదైన శైలిలో జోరు పెంచాడు. వరుసగా రెండు బౌండరీలు, ఒక భారీ సిక్సర్‌తో తన ఉనికిని చాటాడు. ఎడమచేతి బ్యాటర్ క్రీజులో కుదురుకుంటే ప్రమాదమని గ్రహించిన సౌరాష్ట్ర అనుభవజ్ఞుడు చేతన్ సకారియా పాచిక విసిరాడు.

మిడిల్ అండ్ లెగ్ స్టంప్‌పై లెంగ్త్ బాల్ వేశాడు సకారియా. లెగ్ సైడ్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వైభవ్ బ్యాట్ ఫేస్ ముందే మూసేశాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవగా, సకారియా తన ఫాలోత్రూలోనే అద్భుతంగా సర్దుకుని ముందుకు డైవ్ చేసి షార్ప్ క్యాచ్ అందుకున్నాడు.

12 బంతుల్లో 18 పరుగులు చేసి వైభవ్ వెనుదిరగడంతో బీహార్ డగౌట్‌లో నిశ్శబ్దం అలుముకుంది. ఒక యువ ఆటగాడి ఆశయాన్ని మరో యువ బౌలర్ అనుభవంతో తుంచేసిన క్షణమది.

ఈ వికెట్‌తో బీహార్ మూడో వికెట్ కూడా కోల్పోయి పవర్‌ప్లేలోనే కష్టాల్లో పడింది. బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం బూమరాంగ్ అయింది. సౌరాష్ట్ర బౌలర్లు కొత్త బంతితో కట్టుదిట్టమైన లైన్ లెంగ్త్‌తో బీహార్‌ను పూర్తిగా బంధించారు.

నిజానికి ఇది కేవలం 18 పరుగుల ఇన్నింగ్స్ మాత్రమే కాదు. 15 ఏళ్ల వయసులో రాష్ట్ర జట్టుకు కెప్టెన్ కావడం అంటేనే చరిత్ర. ఆ బరువు, అంచనాల భారం ఇన్నింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. షాట్ సెలెక్షన్‌లో తొందరపాటు కనిపించినా, అతనిలోని ధైర్యం, పవర్ హిట్టింగ్ మరోసారి ప్రస్ఫుటమైంది.

వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక మ్యాచ్ వైఫల్యం అతని ప్రతిభను శంకించేందుకు లేదు. కానీ కెప్టెన్సీ అనే అదనపు బాధ్యత అతని బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ సీజన్‌లో ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు టీమిండియా వరకు వెళ్లి వచ్చిన సకారియా తన అనుభవం, చతురతతో మరోసారి తానెందుకు ప్రత్యేకమో నిరూపించుకున్నాడు. SMAT 2026 ఆరంభంలోనే యువత వర్సెస్ అనుభవం పోరు రసకందాయంలో పడింది. వైభవ్ ఈ ఎదురుదెబ్బ నుంచి ఎలా కోలుకుంటాడో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us