Vaibhav Sooryavanshi: 17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన అవకాశం దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో బిహార్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తొలిసారి సీనియర్ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న ఈ యువ ఆటగాడిపై బిహార్ క్రికెట్ అసోసియేషన్ భారీ అంచనాలు పెట్టుకుంది.

Vaibhav Sooryavanshi: 17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..!
Vaibhav Sooryavanshi Captain

Updated on: Nov 07, 2026 | 8:34 AM

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి మరో కీలక బాధ్యత దక్కింది. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) 2026-27 సీజన్‌లో బిహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బిహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యవంశీకి డిప్యూటీగా సూరజ్ కశ్యప్‌ను ఎంపిక చేసింది. నవంబర్ 6న జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 4 నుంచి 6 వరకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు గత రికార్డులను పరిశీలించి జట్టును ఖరారు చేశారు.

బిహార్ జట్టు పూర్తి వివరాలు ఇవే!

వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న బిహార్ జట్టులో అలోక్ కుమార్, ఆయుష్ లోహరుకా, అల్తమాష్ అష్రఫ్, పరమ్ కుమార్ సింగ్, అన్మోల్ కుమార్, రిత్విక్ రాజ్, సూరజ్ కశ్యప్, మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మహమ్మద్ ఇజార్, అమోద్ యాదవ్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, హిమాన్షు సింగ్ చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆయుష్ లోహరుకా, అన్మోల్ కుమార్ వికెట్ కీపర్లు.

నవంబర్ 14న తొలి మ్యాచ్..

2026-27 సీజన్‌లో బిహార్ తన తొలి మ్యాచ్‌లో సౌరాష్ట్రతో తలపడనుంది. నవంబర్ 14న ఇండోర్ వేదికగా ఈ పోరు జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 16న రైల్వేస్ జట్టుతో బిహార్ ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు వైభవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

అయితే ఆ తర్వాత అతడు బిహార్ జట్టును వీడి ఇండియా-ఏ జట్టుతో చేరే అవకాశం ఉంది. ఖతార్ వేదికగా జరిగే 2026 రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ తరఫున ఆడాల్సి ఉంది. నవంబర్ 20న నేపాల్‌తో భారత్-ఏ తొలి మ్యాచ్ ఆడనుంది.

తొలిసారి సీనియర్ జట్టుకు నాయకత్వం!

వైభవ్‌కు సీనియర్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఇది తొలి అవకాశం. గతంలో 2026 దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫైనల్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా తప్పుకోవడంతో కొంతసేపు జట్టును నడిపించాడు.

గత సీజన్‌లో బిహార్ జట్టుకు సకిబుల్ గని నాయకత్వం వహించాడు. అయితే గ్రూప్-బిలో ఏడు మ్యాచ్‌లు ఆడిన బిహార్ కేవలం ఒక్క విజయంతో చివరి స్థానంలో నిలిచింది. ఈసారి వైభవ్ నాయకత్వంలో జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయి సెలెక్టర్లు, దేశవాళీ క్రికెట్ ఎంపికదారులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ యువ ఓపెనర్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us