T20 World Cup: ‘చరిత్రను తిరగరాస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాను ఓడిస్తాం’: పాక్ కెప్టెన్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్ ఓడించలేదు. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్‌తో తిరగరాస్తామని..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్ ఓడించలేదు. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్‌తో తిరగరాస్తామని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ధీమా వ్యక్తం చేశాడు. మరికొద్ది గంటల్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుండగా.. దీని కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అలాగే ఈ మ్యాచ్‌పై ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో విజయం తమదే అంటూ ఇరు జట్లు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన వరల్డ్ కప్‌లను పరిశీలిస్తే పాకిస్తాన్ టీమ్‌పై ఇండియా జట్టే ఆధిపత్యం చలాయించింది. అయితే అది గతం అని అంటున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. గతాన్ని తాము మార్చబోతున్నామంటూ చెబుతున్న బాబర్ అజామ్.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాపై పాకిస్తాన్ తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
“టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు మా జట్టు టీమ్ఇండియాను ఓడించలేదు. కానీ, అది గతం. ఇప్పుడు మేము దాన్ని తిరగరాయబోతున్నాం. అక్టోబరు 24న (ఆదివారం) జరగనున్న మ్యాచ్‌లో విజయం మాదే. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించాం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోరని ఆశిస్తున్నా. టీమ్ఇండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నాం. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తాం” అని పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు.
చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో భాగంగా 2019 జూన్ 16న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం… అది కూడా పొట్టి ప్రపంచకప్‌లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక హిస్టరీ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు ఇండియా – పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు ప్రపంచకప్‌లో తలపడ్డాయి. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్‌లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ జట్టు వ్యూహాలు రచిస్తుంటే.. భారత్ మాత్రం ఈ సారి కూడా ఆధిపత్యం మాదే అంటూ దీమాగా ఉంది.