
SA s WI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 గ్రూప్-1లో అగ్రస్థానాల్లో ఉన్న వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం నేరుగా భారత్ సెమీఫైనల్ భవితవ్యాన్ని ప్రభావితం చేసే కీలక పోరుగా మారింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా బౌలర్లు టీమిండియాకు బూస్ట్ ఇచ్చేలా బౌలింగ్ చేస్తున్నారు. వార్త రాసే సమయానికి వెస్టిండీస్ టీం 10.2 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. దీంతో విండీస్ టీం పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది.
సూపర్-8లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ ప్రచారానికి పెద్ద దెబ్బగా మారింది. దీనితో పాటు వెస్టిండీస్ జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేయడంతో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా నెట్ రన్ రేట్ పరంగా వెనుకబడింది. ప్రస్తుతం భారత్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దక్షిణాఫ్రికా గెలిస్తే, భారత్‌కు ఇది అత్యంత అనుకూల పరిస్థితి. అప్పుడు భారత్ తన మిగిలిన రెండు సూపర్-8 మ్యాచ్‌లలో – జింబాబ్వే, వెస్టిండీస్‌పై – తప్పకుండా గెలవాలి. అలా చేస్తే భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు బలపడతాయి.
వెస్టిండీస్ దక్షిణాఫ్రికాపై గెలిచి సూపర్-8లో వరుసగా రెండు విజయాలు సాధిస్తే, భారత్ మార్గం మరింత క్లిష్టమవుతుంది.
అప్పుడు భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌ను ఓడించినా, అలాగే దక్షిణాఫ్రికా జింబాబ్వేపై గెలిచినా – మూడు జట్లు (భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా) నాలుగు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ పరిస్థితిలో సెమీఫైనల్‌కు అర్హత నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా నిర్ణయించబడుతుంది.
ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ -3.800గా ఉంది. దక్షిణాఫ్రికా (+3.800), వెస్టిండీస్ (+5.350)తో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా, ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాలని ఆశించాల్సి ఉంటుంది.
భారత్‌కు అవకాశాలు పూర్తిగా ముగియలేదు. కానీ ఇప్పుడు ప్రతి మ్యాచ్ ఫలితం కీలకం. ముఖ్యంగా వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా పోరు టీమిండియా సెమీఫైనల్ ప్రయాణానికి కీలక మలుపుగా మారనుంది. అహ్మదాబాద్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్ ఫలితాన్ని భారత్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..