
MS Dhoni: ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, మైదానంలోకి దిగకపోయినా క్రికెట్ ప్రపంచంలో ఆయన క్రేజ్ తగ్గదు. వంద కోట్ల మంది ఆశలను మోస్తూ ఒత్తిడిని జయించడం ఆయనకే చెల్లింది. అందుకే ఎంఎస్ ధోనీకి కోట్లాది మంది అభిమానులతో పాటు మాజీ దిగ్గజాలు కూడా దాసోహమంటారు. తాజాగా సిఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ధోనీ గొప్పతనంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మైకేల్ హస్సీ స్టిక్ టు క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ధోనీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంఎస్ ధోనీ ఒక అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి అని హస్సీ కొనియాడారు. మనందరం ఆటను చూసే విధానానికి, ధోనీ చూసే కోణానికి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు. అందరిలా కాకుండా ప్రతి పరిస్థితినీ చాలా భిన్నంగా విశ్లేషించే అద్భుతమైన నైపుణ్యం ఆయన సొంతమని పేర్కొన్నారు. ఈ విభిన్నమైన ఆలోచనా విధానమే తనను ధోనీకి అభిమానిగా మార్చేసిందని హస్సీ వెల్లడించారు.
వంద కోట్ల మంది ఆశలు
భారత్‌లో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక పిచ్చి. ముఖ్యంగా ధోనీ మైదానంలోకి దిగాడంటే చాలు, దాదాపు వంద కోట్ల మంది కళ్లు ఆయన పైనే ఉంటాయి. అంతటి విపరీతమైన ఒత్తిడి ఉండే వాతావరణం నుంచి రావడం, ఆ ప్రెజర్‌ను ఎంతో సులువుగా జయించడం ధోనీకి మాత్రమే సాధ్యం. మైదానంలో ఎంత పెద్ద సంక్షోభం ఎదురైనా ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడిని తరిమికొట్టే విధానం మైకేల్ హస్సీని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ప్లానింగ్, మైండ్ గేమ్ మైదానంలో టీమ్‌కు కొండంత అండగా నిలుస్తుందని ఆయన వివరించారు.
గాయం నుంచి కోలుకున్న వేళ
గత సీజన్‌లో తీవ్రమైన గాయం కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అయినప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు ఆయన లీడ్ న్యూస్‌గా నిలిచారు. సీజన్ ఆఖరి దశలో ఫుల్ ఫిట్‌నెస్ సాధించినా, సిఎస్కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. లీగ్ దశ ముగియగానే రసవత్తర పోరు జరుగుతున్న వేళ జట్టు అహ్మదాబాద్ వెళ్తే, ధోనీ మాత్రం నేరుగా రాంచీకి పయనమయ్యారు. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2027లో ధోనీ ఆటగాడిగా బరిలోకి దిగుతారా లేదా సపోర్టింగ్ స్టాఫ్‌గా డగౌట్‌కే పరిమితమవుతారా అనేది మిస్టరీగా మారింది.
సిఎస్కే మేనేజ్‌మెంట్ మాస్టర్ ప్లాన్
సిఎస్కే, ధోనీ పేర్లు వేర్వేరు కావు. ఆ జట్టుకు ధోనీ ఒక తిరుగులేని బ్రాండ్ ఇమేజ్. వేలం పాటలు, రిటెన్షన్ నిబంధనల నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆయనను కనీసం వికెట్ కీపర్ బ్యాటర్‌గా, పవర్ ఫినిషర్‌గా బరిలోకి దించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు ధోనీకి జట్టులో షేర్లు కావాలని కోరారని, దానికి కంపెనీ అంగీకరించలేదనే పుకార్లు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. వచ్చే సీజన్‌లో మెంటార్‌గా కనిపిస్తారా లేక ఐపీఎల్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతారా అనేది వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..