WI vs SA: వామ్మో.. ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..

Rabada overtakes Dale Steyn T20 World Cup: దక్షిణాఫ్రికా సీనియర్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా వెస్టిండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా కనిపించిన ఈ బౌలర్.. వెస్టిండీస్‌పై నిప్పులతో చెలరేగాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఓ కీలక రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

WI vs SA: వామ్మో.. ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
Kagiso Rabada Record

Updated on: Feb 26, 2026 | 5:42 PM

టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా అద్భుతమైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రబడా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచి డేల్ స్టెయిన్‌ను అధిగమించాడు.

మ్యాచ్ ప్రారంభంలోనే రబడా వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌ను కూల్చి దక్షిణాఫ్రికాకు కలల ఆరంభాన్ని అందించాడు. కుడిచేతి వేగబంతి సంధించిన అతని ప్రారంభ స్పెల్ విండీస్ బ్యాటింగ్‌ను పూర్తిగా అతలాకుతలం చేసింది. దీంతో డేల్ స్టెయిన్‌ను దాటి టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ల జాబితాలో రబడా రెండో స్థానానికి చేరాడు.

డేల్ స్టెయిన్ రికార్డును అధిగమించిన కగిసో రబడా..

నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ వెస్టిండీస్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. షాయ్ హోప్ – బ్రాండన్ కింగ్ జోడీ 2.1 ఓవర్లలో 29 పరుగులు జోడిస్తూ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చూపింది.

అయితే మూడో ఓవర్‌లో షాయ్ హోప్‌ను ఔట్ చేయడంతో రబడా వెస్టిండీస్ పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న షిమ్రోన్ హెట్‌మైయర్‌ను కూడా పెవిలియన్‌కు పంపి కరీబియన్ జట్టును గట్టిగా కుదిపేశాడు. ఈ రెండు వికెట్లతో రబడా తన టీ20 వరల్డ్ కప్ వికెట్ల సంఖ్యను పెంచి డేల్ స్టెయిన్ రికార్డును దాటాడు.

ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌లో 30 వికెట్లు తీసిన రబడా, ఈ మ్యాచ్‌తో ఆ సంఖ్యను 32కి పెంచాడు. దీంతో అతను దక్షిణాఫ్రికా తరపున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

టీ20 వరల్డ్ కప్‌ల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు..

37 – అన్రిచ్ నోర్జే

32* – కగిసో రబడా*

30 – డేల్ స్టెయిన్

24 – మోర్నే మోర్కెల్

23 – టబ్రైజ్ షమ్సీ

ప్రస్తుతం అన్రిచ్ నోర్జే 37 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, రబడా, డేల్ స్టెయిన్, మోర్నే మోర్కెల్, టబ్రైజ్ షమ్సీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కగిసో రబడా..

ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన కగిసో రబడా, టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ల్లో కొంత ఫామ్ కోల్పోయినట్లు కనిపించాడు. అఫ్ఘానిస్తాన్, కెనడా మ్యాచ్‌ల్లో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీసుకున్న అతను, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వికెట్ లేకుండా నిలిచాడు.

అయితే, వెస్టిండీస్‌పై చూపిన ఈ అద్భుత ప్రదర్శనతో రబడా మళ్లీ తన పాత మోజోను తిరిగి పొందినట్లైంది. సెమీఫైనల్ లక్ష్యంతో దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికాకు రబడా బౌలింగ్ కీలక ఆయుధంగా మారనుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా అతను ఇదే స్థాయిలో రాణిస్తే ప్రోటీస్‌కు భారీ లాభం చేకూరనుంది.

ప్రారంభ పతనం తర్వాత వెస్టిండీస్ పోరాటం..

మ్యాచ్ విషయానికి వస్తే, రబడా షాయ్ హోప్, హెట్‌మైయర్‌లను ఔట్ చేసిన తర్వాత లుంగి ఎన్‌గిడీ కరీబియన్ మిడిల్ ఆర్డర్‌ను చీల్చిచెండాడు. బ్రాండన్ కింగ్, రోస్టన్ చేస్, రోవ్‌మన్ పౌవెల్‌లను పెవిలియన్‌కు పంపాడు.

షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, మ్యాథ్యూ ఫోర్డ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, రోమారియో షెపర్డ్ – జేసన్ హోల్డర్ జోడీ కీలక భాగస్వామ్యంతో జట్టును కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చింది.

ఈ కథనం రాసే సమయానికి వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 8 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us