బేస్ ప్రైస్ రూ.11.5 లక్షలతో ఎంట్రీ.. ఫ్రాంచైజీల పోటీతో కోట్ల వర్షం.. అసలెవరీ 18 ఏళ్ల యంగ్ సెన్సేషన్..?
Jason Rawls SA20: క్రికెట్ ప్రపంచంలో ఒక్క ఆక్షన్ బిడ్ ఓ యువ ఆటగాడి జీవితాన్నే మార్చేయొచ్చు. SA20 సీజన్-5 ఆక్షన్‌లో అదే జరిగింది. కేవలం 18 ఏళ్ల వయసున్న దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడ్డాయి. రూ.11.5 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన అతడి ప్రయాణం ఏకంగా రూ.1.68 కోట్ల దగ్గర ఆగింది. ఇంతకీ ఈ యువ సంచలనం ఎవరు?

Jason Rawls: SA20 సీజన్-5 ఆక్షన్‌లో అక్టోబర్ 7న జేసన్ రౌల్స్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (Joburg Super Kings) జట్టులోకి తీసుకునేందుకు MI కేప్‌టౌన్ (MI Cape Town)తో తీవ్ర పోటీ పడింది. చివరకు జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ 2.9 మిలియన్ ర్యాండ్లు, అంటే సుమారు రూ.1.68 కోట్లు చెల్లించి రౌల్స్‌ను సొంతం చేసుకుంది. అతడి బేస్ ప్రైస్ కేవలం 11.5 లక్షల రూపాయలు. అక్కడి నుంచి బిడ్ ఏకంగా కోట్లకు చేరడం ఈ ఆక్షన్‌లోనే అతిపెద్ద సంచలనంగా నిలిచింది.
రౌల్స్ ఎవరు?
జేసన్ రౌల్స్ ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌లోచదువుతున్నాడు. అంటే ప్రొఫెషనల్ క్రికెట్‌లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టకముందే అతడికి కోట్ల రూపాయల ఫ్రాంచైజీ డీల్ దక్కింది. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్. అవసరమైనప్పుడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. సీనియర్ క్రికెట్‌లో అనుభవం తక్కువే అయినా, జూనియర్ స్థాయిలో రౌల్స్ చూపించిన ప్రతిభ ఫ్రాంచైజీలను ఆకట్టుకుంది.
అండర్-19 వరల్డ్ కప్‌లో అదుర్స్..
2026 అండర్-19 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా తరపున రౌల్స్ కీలక ఆటగాడిగా నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 280 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు దాదాపు 70 కాగా, స్ట్రైక్ రేట్ 112గా ఉంది. ఈ టోర్నీలో అతడి ఖాతాలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రౌల్స్ తన సామర్థ్యాన్ని చూపించాడు. టోర్నీలో 4 వికెట్లు పడగొట్టాడు.
ఎక్కువమంది చదివినది: నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?
భారత్‌పైనా సెంచరీ..
భారత్ అండర్-19 జట్టుతో జరిగిన మూడు యూత్ వన్డేల సిరీస్‌లోనూ రౌల్స్ సత్తా చాటాడు. ఆ సిరీస్‌లో 149 పరుగులు చేశాడు. సగటు దాదాపు 50. ముఖ్యంగా ఒక సెంచరీ సాధించడం అతడి బ్యాటింగ్ సామర్థ్యానికి మరో ఉదాహరణగా నిలిచింది.
ఇంగ్లండ్‌పై 201 పరుగుల విధ్వంసం..!
జేసన్ రౌల్స్ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇన్నింగ్స్ జూలై 2026లో వచ్చింది. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్టులో రౌల్స్ ఏకంగా 201 పరుగులు చేశాడు. 296 బంతులు ఎదుర్కొన్న అతడు 23 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ డబుల్ సెంచరీతో దక్షిణాఫ్రికా తరపున యూత్ టెస్టుల్లో ద్విశతకం సాధించిన బ్యాటర్ల ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించాడు.
ఫాఫ్, పొలార్డ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి..!
జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ రౌల్స్‌తో పాటు ఇద్దరు భారీ అనుభవం ఉన్న టీ20 స్టార్లను కూడా జట్టులోకి తీసుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) కోసం 2.7 మిలియన్ ర్యాండ్లు ఖర్చు చేసింది. వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ (Kieron Pollard)ను 1.5 మిలియన్ ర్యాండ్లకు తీసుకుంది. ఇప్పుడు 18 ఏళ్ల రౌల్స్‌కు ఫాఫ్, పొలార్డ్ వంటి దిగ్గజాలతో ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే అవకాశం లభించింది. అతడి క్రికెట్ ఎదుగుదలకు ఇది కీలక అనుభవంగా మారే అవకాశం ఉంది.
గ్రీమ్ స్మిత్‌కు ఇదే ప్రత్యేక క్షణం..
SA20 లీగ్ కమిషనర్ గ్రీమ్ స్మిత్ (Graeme Smith) కూడా రౌల్స్‌పై జరిగిన బిడ్డింగ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 18 ఏళ్ల ఆటగాడి కోసం ఆక్షన్‌లో అత్యంత పెద్ద బిడ్డింగ్ పోరు జరగడం.. ఫ్రాంచైజీలు కొత్త తరం ఆటగాళ్లపై ఎంత నమ్మకం పెంచుకున్నాయో చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది SA20 యువ ప్రతిభకు అందిస్తున్న అవకాశాలకు కూడా మంచి ఉదాహరణగా నిలిచింది.
ఎక్కువమంది చదివినది: ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
రోహిత్ శర్మ కోచ్‌తోనూ ట్రైనింగ్..!
జేసన్ రౌల్స్ ఎదుగుదలలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు కోచ్‌గా పనిచేసిన దినేష్ లాడ్ (Dinesh Lad) వద్ద కూడా రౌల్స్ శిక్షణ తీసుకున్నాడు. రౌల్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు చూసిన లాడ్ అతడిని భారత్‌కు రావాలని ఆహ్వానించారు. దీంతో రౌల్స్ భారత్‌కు వచ్చి దాదాపు నెల రోజుల పాటు దినేష్ లాడ్ వద్ద ప్రత్యేక సెషన్స్‌లో శిక్షణ పొందాడు.
ఇప్పుడు అసలైన పరీక్ష మొదలు..!
ఆక్షన్‌లో రూ.1.68 కోట్ల భారీ ధర దక్కడం జేసన్ రౌల్స్‌కు గొప్ప గుర్తింపు. కానీ అసలైన సవాల్ మాత్రం SA20లోనే ఎదురుకానుంది. SA20 తదుపరి సీజన్ 2027 జనవరి 17న ప్రారంభం కానుంది. జూనియర్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన రౌల్స్.. ఇప్పుడు ప్రపంచ స్థాయి టీ20 ఆటగాళ్లతో పోటీ పడాలి.
జేసన్ రౌల్స్ కథలో అసలు ఆసక్తి రూ.1.68 కోట్ల ధరలో మాత్రమే లేదు. 18 ఏళ్ల వయసులోనే ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇంతటి నమ్మకం సంపాదించడమే అసలు విషయం. స్కూల్ క్రికెట్, అండర్-19 వరల్డ్ కప్, భారత్‌పై ప్రదర్శన, ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ.. ఇలా ప్రతి దశలో తన ప్రతిభకు రుజువులు ఇచ్చాడు.
ఇప్పుడు ఆ ప్రతిభను SA20 వంటి పెద్ద వేదికపై చూపించాల్సిన సమయం వచ్చింది. ఫాఫ్, పొలార్డ్ వంటి దిగ్గజాల మధ్య 18 ఏళ్ల రౌల్స్ ఎలా మెరుస్తాడన్నది 2027 సీజన్‌లో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం. ఈ బిడ్డింగ్ చూస్తుంటే.. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో పెద్ద స్టార్ పుట్టుకొస్తున్నాడనే అంచనాలు మాత్రం ఇప్పటికే మొదలయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




