
LSG Retention List: ఓడిపోయిన జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గెలిచిన జట్టు కంటే ఎక్కువ కసితో తిరిగి రావాలి. లక్నో సూపర్ జెయింట్స్ సరిగ్గా అదే మంత్రాన్ని నమ్మింది. నవంబర్ 17, రిటెన్షన్ డెడ్‌లైన్ రోజున 10 జట్లలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న జట్టు ఏదైనా ఉందంటే అది LSGనే. చేతిలో రూ.47.45 కోట్లు.. 10 జట్లలో అతిపెద్ద పర్స్. ఖాళీలు ఏకంగా ఏడు. అంటే డిసెంబర్ 16న గోవాలో జరగబోయే మినీ వేలంలో చక్రం తిప్పబోయేది లక్నోనే!
గత సీజన్ లక్నోకు పీడకల. ఆశలతో బరిలోకి దిగి, చివరికి పట్టికలో ఆఖరి స్థానంతో ఇంటిదారి పట్టింది. ఆ వైఫల్యానికి ప్రధాన కారణాలు కచ్చితత్వం లేని పేస్ దళం, తేలిపోయిన స్పిన్ విభాగం. యాజమాన్యం ఆ రెండు లోపాలపైనే కత్తి దూసింది.
ఈ రిటెన్షన్‌లో అతిపెద్ద బ్రేకింగ్ – రిషభ్ పంత్ ట్రేడ్. రూ.15 కోట్ల కెప్టెన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంపి, అక్కడి నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు) ను లక్నో తెచ్చుకుంది. ఇది కేవలం ఆటగాళ్ల మార్పిడి కాదు, జట్టు తత్వంలోనే మార్పు. వికెట్ వెనుక, ముందు రెండు వైపులా నడిపించగల నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) ను నంబర్-1 గా నిలబెట్టి, పగ్గాలు అతడి చేతికి ఇవ్వడానికి LSG సిద్ధమైందనడానికి ఇదే సంకేతం.
పూరన్‌తో పాటు మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, జోష్ ఇంగ్లిస్ వంటి విదేశీ కోర్‌ను యథాతథంగా ఉంచారు. భారత యువ బ్రిగేడ్ – ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, దిగ్వేశ్ రాఠీలపై నమ్మకం ఉంచారు. ఎక్స్‌ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మోహ్సిన్ ఖాన్ ఫిట్‌నెస్‌పై పందెం వేశారు. అర్జున్ టెండూల్కర్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్ వంటి యువ పేసర్లను కొనసాగించారు.
అంతేకాదు, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆల్‌రౌండర్ శామ్ కర్రన్ (రూ.2.40 కోట్లు) ను ట్రేడ్ ద్వారా తెచ్చుకుని బ్యాలెన్స్ పెంచుకున్నారు. మహ్మద్ షమీ (RRకి), ఎం. సిద్ధార్థ్‌లను వదులుకున్నారు.
రిలీజ్ జాబితా చూస్తే LSG ఎంత కఠినంగా వ్యవహరించిందో అర్థమవుతుంది. రూ.9.75 కోట్ల భారీ ధరగాడు ఆవేశ్ ఖాన్‌ను వదిలించుకోవడం మొదటి సర్జరీ. ధరకు తగ్గ ప్రదర్శన లేదు, డెత్ ఓవర్లలో ధారణ లేదు. ఇక దక్షిణాఫ్రికా ఎక్స్‌ప్రెస్ అన్రిచ్ నోర్జే (రూ.2 కోట్లు), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ (రూ.2 కోట్లు) కూడా అంచనాలను అందుకోలేకపోయారు. వారితో పాటు జార్జ్ లిండే, నమన్ తివారీ, మాథ్యూ బ్రీట్జ్కే, అర్షిన్ కులకర్ణిలను రిలీజ్ చేశారు. మొత్తం ఏడుగురిని వదిలి, జట్టు ఖజానాను నింపుకుంది.
రిటైన్ చేసిన ప్లేయర్లు (16 + 2 ట్రేడ్ ఇన్): నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, జోష్ ఇంగ్లిస్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, మోహ్సిన్ ఖాన్, మిచెల్ మార్ష్, ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంషీ, ఎయిడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ సింగ్, అర్జున్ టెండూల్కర్, ప్రిన్స్ యాదవ్
ట్రేడ్ ద్వారా వచ్చినవారు: కుల్దీప్ యాదవ్ (DC నుంచి), శామ్ కర్రన్ (RR నుంచి)
రిలీజ్ చేసిన 7 మంది: ఆవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జే, వనిందు హసరంగ, జార్జ్ లిండే, నమన్ తివారీ, మాథ్యూ బ్రీట్జ్కే, అర్షిన్ కులకర్ణి.
ట్రేడ్ ద్వారా వెళ్లినవారు: రిషభ్ పంత్ (DCకి), మహ్మద్ షమీ (RRకి), ఎం. సిద్ధార్థ్ (RRకి)
మిగిలిన పర్స్: రూ.47.45 కోట్లు (అన్ని జట్లలో అత్యధికం), ఖాళీ స్లాట్లు: 7, విదేశీ ఖాళీలు: 3
చేతిలో 47 కోట్లు, 7 ఖాళీలు ఉంటే ఏ జట్టైనా వేలాన్ని శాసించగలదు. LSG అవసరాలు స్పష్టంగా ఉన్నాయి – ఒక నాణ్యమైన భారత పేసర్, ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్, ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్. పూరన్ నాయకత్వంలో, కుల్దీప్ స్పిన్‌తో, మార్ష్-మార్క్రమ్-ఇంగ్లిస్ విదేశీ దళంతో లక్నో ఇప్పుడు కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది.
2026లో అట్టడుగు.. 2027లో అగ్రస్థానం.. లక్నో కథ ఇలా మారుతుందా? గోవా వేలం టేబుల్ మీదే దీనికి సమాధానం దొరుకుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..