
India vs Pakistan U19 Final: ఇది కేవలం ఫైనల్ మ్యాచ్ కాదు. రెండు దేశాల క్రికెట్ భవిష్యత్తు తలపడే యుద్ధం. గాయాన్ని మాన్పుకునే అవకాశం. గత ఏడాది 2025 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో 151 పరుగుల తేడాతో ఎదురైన అవమానకర ఓటమి ఇంకా భారత యువ క్రికెటర్ల మనసుల్లో సజీవంగా ఉంది. ఇప్పుడు అదే ప్రత్యర్థి, అదే టైటిల్ పోరు. వేదిక – ఒమన్‌లోని అల్ అమెరట్ క్రికెట్ గ్రౌండ్ (మినిస్ట్రీ టర్ఫ్ 2). శనివారం జరిగే అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ తొమ్మిదో టైటిల్ వేటలో ఉంటే, రెండుసార్లు చాంపియన్ అయిన పాకిస్తాన్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. లీగ్ దశలో ఇరు జట్లు ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌దే పైచేయి అయింది. కానీ ఫైనల్ లెక్కలు వేరు. ఒత్తిడిని జయించిన వాడే విజేత.
ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ ప్రయాణం ఇద్దరు యువ స్టార్ల చుట్టూనే తిరిగింది. వీరేంద్ర సెహ్వాగ్ వారసుడిగా బరిలోకి దిగిన ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారాడు. 4 మ్యాచుల్లో 101 సగటుతో 303 పరుగులు – ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు. టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా ఫైనల్‌కు వస్తున్నాడు.
బంతితో ఇషాన్ సూద్ నిప్పులు చెరుగుతున్నాడు. 4 మ్యాచుల్లో 11 వికెట్లతో భారత దాడికి నాయకత్వం వహిస్తున్నాడు. పేస్‌తో పాటు ఖచ్చితమైన లైన్-లెంగ్త్ అతని ప్రత్యేకత.
అయితే, ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో ఇద్దరిపైనే భారం వేస్తే కష్టం. మిగతా బ్యాటర్లు, ముఖ్యంగా స్పిన్ విభాగం బాధ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్, మిడిల్ ఆర్డర్‌లో అర్జున్ రాజ్‌పుత్, వీకే వినీత్ కీలకం కానున్నారు. టోర్నీలో వీరి ప్రదర్శన నిలకడగా లేకపోయినా, మెరుపులు మెరిపించారు. పాకిస్తాన్‌పైనే లీగ్ మ్యాచ్‌లో అర్జున్ రాజ్‌పుత్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై కెప్టెన్ లక్ష్య 93 పరుగులతో జట్టును గెలిపించాడు. వినీత్ హాఫ్ సెంచరీ కూడా అదే మ్యాచ్‌లో కీలకంగా మారింది. ఫైనల్లో ఈ ముగ్గురిలో ఒక్కరు నిలబడినా మ్యాచ్ స్వరూపం మారిపోతుంది.
బౌలింగ్‌లో సూద్‌కు అండగా స్పిన్నర్లు అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్ నిలవాలి. ఇద్దరూ చెరో 5 వికెట్లు తీసినా, అందులో మూడు వికెట్లు ఒకే మ్యాచ్‌లో రావడం ఆందోళన కలిగించే అంశం.
పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్‌లో ఉస్మాన్ ఖాన్ (238 పరుగులు) ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌పై లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హమ్జా జహూర్ అత్యంత ప్రమాదకారి.
బౌలింగ్‌లో పాక్‌దే సంఖ్యాబలం. పేసర్ రిజ్వానుల్లా 11 వికెట్లతో భారత సూద్‌కు దీటుగా ఉన్నాడు. అతనికి తోడుగా మహ్మద్ సయ్యమ్ (8 వికెట్లు), అలీ రజా (6 వికెట్లు) ఉన్నారు.
ఒకవైపు ప్రతీకారం, మరోవైపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే పోరాటం. అనుభవం, ప్రతిభకు ఒత్తిడిని తట్టుకునే మనోధైర్యం తోడైతేనే అమెరట్‌లో కప్ ముద్దాడుతుంది.
మ్యాచ్ ఎప్పుడు: శనివారం, నవంబర్ 14, ఉదయం 10:30 గంటలకు (IST)
వేదిక: అమెరట్ క్రికెట్ గ్రౌండ్ (మినిస్ట్రీ టర్ఫ్ 2), అల్ అమెరట్
ప్రత్యక్ష ప్రసారం: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్‌లో లైవ్ స్ట్రీమింగ్
భారత్ U19: లక్ష్య రాయ్‌చందానీ (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ (వైస్ కెప్టెన్), కుశాగ్ర ఓఝా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), వీ యశ్వీర్, ఆర్యన్ సవ్సాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షావిన్ వినోద్, ఇషాన్ సూద్.
పాకిస్తాన్ U19: ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సన్, ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్, హస్నైన్ అబ్బాస్ దార్, జహంగీర్ బిలాల్, అహ్మద్ హుస్సేన్, నిఖాబ్ షఫీక్, హమ్జా జహూర్, అబ్దుల్ సుభాన్, అలీ రజా, మహ్మద్ హుజైఫా, మహ్మద్ సయ్యమ్, రిజ్వానుల్లా, అబ్దుల్ ఖాదిర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..