Team India: భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు? ఇదిగో పూర్తి లెక్కలు..!

T20 World Cup 2026 Semi Final Schedul: భారత జట్టు విండీస్‌పై గెలిస్తే సెమీస్ చేరుతుంది. అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుందనే క్లారిటీపై అభిమానులు తర్జన భర్జనలు పడుతున్నారు. ప్రస్తుత సమాచారం మేరకు భారత జట్టు సెమీస్ ఎప్పుడు ఆడుతుందో ఓసారి చూద్దాం..

Team India: భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు? ఇదిగో పూర్తి లెక్కలు..!
Team India

Updated on: Feb 28, 2026 | 5:31 PM

India semi final date T20 World Cup 2026: టీమిండియా సెమీఫైనల్ చేరుతుందా? లేక వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి నిష్క్రమిస్తుందా? అన్నది మార్చి 1, ఆదివారం తేలనుంది. ఆ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్–వెస్టిండీస్ మధ్య సూపర్-8 దశలో చివరి మ్యాచ్ జరగనుంది. గ్రూప్-1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో ఈ మ్యాచ్‌తో నిర్ణయం కానుంది.

అయితే, భారత్ గెలిచి సెమీఫైనల్‌కు చేరితే, తదుపరి మ్యాచ్ 4న జరుగుతుందా? లేక 5న జరుగుతుందా? అన్న ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

సూపర్-8లో తొలి ఓటమి..

లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ తన నాలుగు మ్యాచ్‌లన్నీ గెలిచి సూపర్-8లో అడుగుపెట్టింది. కానీ, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఆ ఓటమి తర్వాత జింబాబ్వేపై ఘన విజయం సాధించి భారత్ సెమీఫైనల్ రేసులో నిలిచింది. ముఖ్యంగా ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను ఓడించడంతో భారత్ అవకాశాలు పెరిగాయి. లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేది.

మార్చి 1 – భారత్ vs వెస్టిండీస్ ‘డూ ఆర్ డై’ మ్యాచ్..

మార్చి 1న కోల్‌కతాలో జరిగే భారత్–వెస్టిండీస్ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. రెండు జట్లూ రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన చాంపియన్లే. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటపడుతుంది.

వెస్టిండీస్ ఇప్పటికే కోల్‌కతాలో రెండు మ్యాచ్‌లు ఆడింది. భారత్ మాత్రం ఇక్కడ మొదటిసారి ఆడనుంది. కాబట్టి, పరిస్థితులపై విండీస్‌కు కొంత అవగాహన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సెమీఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ?

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. రెండు సెమీస్ కూడా భారత్‌లోనే నిర్వహించనున్నారు.

గ్రూప్-1 టాప్ జట్టు vs గ్రూప్-2 రెండో స్థానం జట్టు – మార్చి 4

గ్రూప్-2 టాప్ జట్టు vs గ్రూప్-1 రెండో స్థానం జట్టు – మార్చి 5

ప్రస్తుతం దక్షిణాఫ్రికా గ్రూప్-1 టాప్‌గా నిలిచింది. గ్రూప్-2లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది.

అందువల్ల భారత్ వెస్టిండీస్‌ను ఓడించి గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిస్తే, మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడే అవకాశం ఉంది.

మరోవైపు మార్చి 4న దక్షిణాఫ్రికా, గ్రూప్-2లో రెండో స్థానానికి పోటీ పడుతున్న న్యూజిలాండ్ లేదా పాకిస్థాన్‌తో తలపడే అవకాశం ఉంది.

భారత్–పాక్ క్లాష్ మిస్సవుతుందా?

ఈ సమీకరణాల ప్రకారం సెమీఫైనల్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే ఫైనల్‌కు రెండు జట్లూ చేరితే మాత్రమే ఆ మహా పోరు సాధ్యమవుతుంది.

మొత్తానికి, భారత్‌కు ఇప్పుడు ఒకే లక్ష్యం – వెస్టిండీస్‌పై విజయం. అప్పుడు మాత్రమే సెమీఫైనల్ తేదీ (4 లేదా 5) ప్రశ్న ప్రాసంగికమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us