సూపర్-8 తొలి మ్యాచ్ భారీ తప్పిదం.. తెలుగబ్బాయ్ దెబ్బకు టీమిండియా ఆగమాగం..?

IND vs SA, Tilak Varma: టీమిండియా సూపర్ 8 తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. దీంతో సెమీస్ చేరే అవకాశాలు చేజారాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తెలుగబ్బాయ్ తిలక్ వర్మను తప్పించాలంటూ షాకిచ్చాడు.

సూపర్-8 తొలి మ్యాచ్ భారీ తప్పిదం.. తెలుగబ్బాయ్ దెబ్బకు టీమిండియా ఆగమాగం..?
Team India T20i World Cup 2026

Updated on: Feb 24, 2026 | 12:39 PM

Tilak Varma: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు 76 పరుగుల భారీ ఓటమి ఎదురైంది. ఈ పరాజయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ ఓటమి తర్వాత మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (క్రిస్ శ్రీకాంత్) తిలక్ వర్మపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

భారత్‌కు 76 పరుగుల ఓటమి.. అభిమానుల్లో ఆగ్రహం..

188 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన భారత్, తొలి బంతికే ఇషాన్ కిషన్ డక్‌గా ఔటవ్వడంతో ఒత్తిడిలో పడింది. ఆ కీలక సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ, పొడవాటి పేసర్ మార్కో జాన్సన్ బౌలింగ్‌లో తన రెండో బంతికే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.

అది పెద్ద తప్పిదంగా మారింది. తిలక్ వర్మ కేవలం ఒకే ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో భారత్ స్కోర్ 5/2గా మారింది. ఈ వికెట్ టీమిండియాకు భారీ దెబ్బగా మారింది. ఆ తర్వాత బ్యాటింగ్ పూర్తిగా కుదేలైంది. చివరికి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

తిలక్ వర్మ స్థానం మీదే ప్రశ్నలు..

భారీ ఓటమి తర్వాత శ్రీకాంత్ తన అసహనాన్ని దాచుకోలేకపోయారు. తిలక్ వర్మ షాట్ సెలెక్షన్‌ను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, తిలక్ వర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కూడా ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగే తదుపరి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తే, తిలక్ వర్మను బెంచ్‌పై కూర్చోబెట్టే అవకాశం ఉందని చెప్పారు.

తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సంజూ శాంసన్ తుది జట్టులోకి వస్తే తిలక్ వర్మకు స్థానం ఉండదు. ఆ రోజు ఆడిన షాట్ చూసి చాలామంది అతని స్థానం మీదే ప్రశ్నలు వేస్తున్నారు. ఈరోజు ఆడిన ఆ షాట్ కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించే అవకాశమూ ఉంది. అది చాలా చెత్త షాట్. అటువంటి షాట్ ఆడిన తర్వాత క్రీజ్‌లో నిలబడే అర్హత కూడా అతనికి లేదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ 2026లో తిలక్ వర్మ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఐదు మ్యాచ్‌ల్లో 23 ఏళ్ల తిలక్ వర్మ 107 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 21.40, స్ట్రైక్‌రేట్ 118.88గా ఉంది.

విరాట్ కోహ్లీ లేని లోపు స్పష్టంగా కనిపిస్తోంది..!

శ్రీకాంత్ మరో కీలక వ్యాఖ్య చేశారు. కీలక మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ను నిలబెట్టే ఆటగాడిగా విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ లేకపోవడం భారత్‌కు పెద్ద లోటుగా మారిందన్నారు. 2024 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ టీ20 అంతర్జాతీయాలకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒత్తిడి ఛేజింగ్‌ల్లో భారత్ తడబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

“టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గెలిచిన మూడు ఛేజింగ్ మ్యాచ్‌ల్లో కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. విరాట్ కోహ్లీ లాంటి ఛేజ్ మాస్టర్ లేకపోవడం వల్ల జట్టులో భారీ ఖాళీ ఏర్పడింది. అతను లేకుండా భారత్ భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడంలో ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఇకపై ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేసి భారత్‌పై ఛేజ్ ఒత్తిడి పెడతాయి” అని శ్రీకాంత్ అన్నారు.

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌పై కూడా విమర్శలు

ఇదే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెత్త షాట్ సెలెక్షన్‌పై మాజీ భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా తీవ్రంగా విమర్శించారు.

జియోస్టార్‌తో మాట్లాడిన నాయర్ మాట్లాడుతూ.. “ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మధ్య ఎవరు స్ట్రైక్ తీసుకోవాలి అనే విషయంలో చర్చ జరగాల్సిందే. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ పై కీలక బాధ్యత పడింది. ఇది భారత్‌కు పెద్ద సమస్య” అని అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us