
David Warner vs Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఏడేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన శాండ్‌పేపర్ ఉదంతం మళ్లీ బయటకు వచ్చింది. మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ ‘సబర్’ (Sabr) లో చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ వివాదం తిరిగి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్.. ఖవాజా ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. అయితే, కమిన్స్ వ్యాఖ్యలపై సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఘాటుగా స్పందించాడు. ఖవాజా వెర్షన్‌కు పూర్తి మద్దతుగా నిలిచిన వార్నర్.. కమిన్స్ తన మాజీ సహచరుడిని ‘బస్ కిందకు తోశాడు’ (threw under the bus) అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పెర్త్‌లో జరిగిన తొలి వన్డే సందర్భంగా కాయో స్పోర్ట్స్ (Kayo Sports) కవరేజీలో వార్నర్‌ను కమిన్స్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. దానికి సమాధానంగా వార్నర్ కుండబద్దలు కొట్టాడు.
“పాట్ కమిన్స్ చాలా ప్రిపేర్ అయి వచ్చాడు. నేను ఇప్పటికీ ఉజ్జీ (ఖవాజా) కి, అతడు తన పుస్తకంలో రాసిన విషయాలకే కట్టుబడి ఉన్నాను. అదే నిజం. ఈ సమయంలో అతడి పట్ల నాకు సానుభూతి ఉంది. కెప్టెన్ ఈరోజు నిజంగా ఉజ్జీని బలిపశువును చేశాడని అనుకుంటున్నాను. దాని పట్ల నేను చాలా నిరాశ చెందాను,” అని వార్నర్ వ్యాఖ్యానించాడు.
ఖవాజా తన ‘సబర్’ పుస్తకంలో 2018 కేప్‌టౌన్ టెస్ట్‌లో శాండ్‌పేపర్‌తో బాల్ టాంపరింగ్ చేసే ప్లాన్ ఆస్ట్రేలియా బౌలర్లకు ముందే తెలుసని ఆరోపించాడు. దీనిపై స్పందించిన కమిన్స్.. “ఇది పూర్తిగా చెత్త, అర్థం లేని మాట (complete and utter nonsense)” అని కొట్టిపారేశాడు. మైదానంలోకి శాండ్‌పేపర్ తీసుకెళ్తున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని కమిన్స్ స్పష్టం చేశాడు.
ఖవాజా వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి వార్నర్ స్థిరంగా అతడికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పుడు కమిన్స్ సమాధానంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఇదే అంశంపై రెండు రోజుల క్రితం మిచెల్ స్టార్క్ కూడా తనకు ఏమీ తెలియదని ఖండించాడు. గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మిచెల్ మార్ష్ మాత్రం ఈ వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించి తప్పుకున్నాడు.
ఒకప్పుడు కలిసి ఆడిన సహచరులే ఇప్పుడు భిన్నమైన వెర్షన్లు చెబుతుండటంతో శాండ్‌పేపర్ గేట్ మరో మలుపు తిరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వ్యవహారాన్ని ఎంత త్వరగా సద్దుమణిగేలా చేస్తే అంత మంచిది. లేదంటే, జట్టులో చీలికలు బహిర్గతమై, రాబోయే సిరీస్‌లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..