భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ముందుగా పెర్త్‌లో నిర్వహించిన 3-రోజుల సిమ్యులేషన్ గేమ్‌లో తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. భారత A జట్టుతో జరిగిన ఈ గేమ్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్ల ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. కోహ్లీ తొలి ఇన్నింగ్సులో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండోసారి తిరిగి బరిలోకి దిగిన కోహ్లీ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ గేమ్‌లో ఆటగాళ్లకు అనుభవం అందించాలనే ఉద్దేశంతో నిబంధనలు మార్చామని భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ సూచనల మేరకు గేమ్ సిమ్యులేషన్ రూపొందించబడింది. ఆటగాళ్లకు గ్రౌండ్ లో ఎక్కువ సమయం ఇవ్వడం, ఆస్ట్రేలియా పిచ్‌లను అర్థం చేసుకునే అవకాశం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
జస్ప్రీత్ బుమ్రా 18 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి తన రిథమ్ మెరుగుపరచుకున్నారు. మహ్మద్ సిరాజ్ సహా ఇతర పేసర్లు కూడా ప్రాక్టీస్ గేమ్‌లో చురుకుగా పాల్గొన్నారు. ఆటగాళ్లు నెట్ సెషన్‌లతో పాటు మధ్యలో పిచ్ మీద ఎక్కువ సమయం గడిపారు. బౌలర్లు తమ స్పెల్స్ పై పూర్తి శ్రద్ధ పెట్టారు, ఒక్కో బౌలర్ సగటున 15 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
“గేమ్ మొదట ఒక సాధారణ మ్యాచ్‌లా ప్రారంభమైంది. అయితే, ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి పరిస్థితులను మెరుగుగా అర్థం చేసుకునేలా సవరణలు చేశాం” అని నాయర్ అన్నారు. ఈ సిమ్యులేషన్ గేమ్ భారత జట్టుకు ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కీలకమైన ప్రాక్టీస్ అనుభవాన్ని అందించింది. జట్టుకు సవాలైన ఆస్ట్రేలియా పిచ్‌లపై మెరుగైన ప్రదర్శనకు ఈ గేమ్ ఉపయోగపడింది. కోహ్లీ బ్యాటింగ్, బుమ్రా బౌలింగ్ కూడా గాడిలో పడింది.