IND vs NZ: చివరి వన్డేలో అర్ష్‌దీప్‌కు అవార్డు.. మ్యాచ్ ఆడకపోయినా సిరీస్ హీరోగా గుర్నూర్
IND vs NZ: భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. చివరి వన్డేకు దూరమైన గుర్నూర్ బ్రార్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసిన అతడు తన టాలెంట్ చూపించాడు. ఐదో వన్డేలో అర్ష్‌దీప్ 30 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ 22 పరుగులతో గెలిచి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ ముగిసింది. చివరి మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 10 ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు చివరి వన్డేలో ఆడని గుర్నూర్ బ్రార్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం లభించింది.
మూడు వికెట్లతో అర్ష్‌దీప్ అదుర్స్
న్యూజిలాండ్ ముందు భారత్ 210 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ ఒక దశలో మంచి స్థితిలోనే కనిపించింది. అయితే భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ కీలక సమయంలో దెబ్బకొట్టాడు. విల్ యంగ్, నిక్ కెల్లీతో పాటు క్రిస్టియన్ క్లార్క్‌ను పెవిలియన్‌కు పంపించాడు. మొత్తం 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన అతడు భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మ్యాచ్ ఆడకపోయినా గుర్నూర్‌కే సిరీస్ అవార్డు
ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత పేసర్ గుర్నూర్ బ్రార్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతడు చివరి వన్డేలో బరిలోకి దిగలేదు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కడంతో ముందుగానే టెస్టు సన్నాహకాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. అయినప్పటికీ వన్డే సిరీస్‌లో అతడు చూపిన ప్రతిభకు ఈ అవార్డు దక్కింది.
మూడు మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు
గుర్నూర్ బ్రార్ ఈ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఇందుకోసం 143 పరుగులు ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ కూడా మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి గుర్నూర్‌తో సమానంగా నిలిచాడు. అయినప్పటికీ సిరీస్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గుర్నూర్‌ను ఎంపిక చేశారు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు సాధించాడు.
బ్యాటర్లు కాదు బౌలర్లే గెలిపించారు
ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ చెరో 46 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అర్ష్‌దీప్ మూడు వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ 22 పరుగులతో గెలిచి ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
