
Abhishek Sharma vs Travis Head vs Phil Salt vs Pathum Nissanka: ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ క్రికెట్ హాట్ టాపిక్‌గా మారింది. అన్ని క్రికెట్ ఆడే దేశాలు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ త్వరలోనే సూపర్-8 దశకు చేరుకోనుంది. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 22న భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, ఈ వరల్డ్ కప్‌లో తమ బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్‌ను ఊపేస్తున్న నలుగురు స్టార్ ఓపెనర్లపై ఓ లుక్కేద్దాం. అభిషేక్ శర్మ (Abhishek Sharma), ట్రావిస్ హెడ్డు (Travis Head), ఫిల్ సాల్ట్ (Phil Salt), పాథుమ్ నిశాంక (Pathum Nissanka) ఈ లిస్ట్ లో ఉన్నారు. కాగా, ఈ నలుగురిలో ప్రస్తుతానికి ఎవరు నంబర్-1 ఓపెనర్? అనేది చూద్దాం..
టీమిండియా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మరో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించే. ఒకప్పుడు భారత ఓపెనర్లు ఆరంభంలో నిదానంగా ఆడి, తర్వాతే దాడికి దిగేవారు. కానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లు ఆ పాత విధానాన్ని మార్చి, మొదటి నుంచే అటాకింగ్ క్రికెట్ ఆడే కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు.
2024 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు అభిషేక్ శర్మ 40 టీ20ఐ మ్యాచ్‌లు ఆడి, సగటు సుమారు 35తో 1,297 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 2 సెంచరీలు, 8 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే, అతడు 5 సార్లు సున్నాకే ఔటైన రికార్డ్ కూడా ఉంది. అందులో రెండు సార్లు వరల్డ్ కప్ 2026లోనే డక్ అవ్వడం విశేషం.
ఇప్పటి వరకూ 39 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ 88 సిక్సర్లు, 123 ఫోర్లు బాదాడు. అతడి హైయెస్ట్ స్కోర్ 135 పరుగులు. టీ20ఐలో అతడి అత్యంత ప్రత్యేకమైన రికార్డు స్ట్రైక్ రేట్ సుమారు 193గా ఉంది. వేగంగా స్కోరు చేయడంలో అతడికి సాటిలేని పేరు వచ్చింది.
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్డు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేలుడు బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిబ్రవరి 2026 వరకు అతడు 52 టీ20ఐ మ్యాచ్‌ల్లో సుమారు 1,303 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 91 పరుగులు కాగా, స్ట్రైక్ రేట్ 155కి పైగానే ఉంది. స్పిన్నర్లపై కూడా అతడు దూకుడుగా ఆడగలడు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో హెడ్డు 29 బంతుల్లో 56 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. ఇప్పటివరకు అతడు టీ20ఐలో సెంచరీ చేయలేకపోయినా, 6 అర్ధశతకాలతో ఆస్ట్రేలియాకు ఎన్నోసార్లు వేగవంతమైన ఆరంభాలు అందించాడు. అయితే, మొత్తం మీద అభిషేక్ శర్మతో పోలిస్తే అతడి ప్రభావం కొంచెం తక్కువగానే కనిపిస్తోంది.
ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ ప్రస్తుతం టీ20ఐల్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఫిబ్రవరి 2026 వరకు అతడు 56 మ్యాచ్‌ల్లో 52 ఇన్నింగ్స్‌లు ఆడి సుమారు 1,648 పరుగులు చేశాడు. అతడి సగటు 35.82 కాగా, స్ట్రైక్ రేట్ 166.67 ఉండటం అతడి దూకుడును చాటుతోంది.
టీ20ఐల్లో అతడి ఖాతాలో 4 సెంచరీలు, 7 అర్ధశతకాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై 141* పరుగులతో అతడు ఇంగ్లాండ్ తరపున అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. అంతేకాదు, కేవలం 39 బంతుల్లోనే ఇంగ్లాండ్ తరఫున వేగవంతమైన టీ20ఐ సెంచరీ చేసిన రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. వెస్టిండీస్‌పై వరుసగా రెండు టీ20ఐ సెంచరీలు చేసిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా కూడా సాల్ట్ చరిత్ర సృష్టించాడు. అయినప్పటికీ, స్ట్రైక్ రేట్ విషయంలో అభిషేక్ శర్మతో పోలిస్తే అతడు కొద్దిగా వెనుకబడుతున్నాడు.
శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశాంక టీ20ఐల్లో ప్రస్తుతం కెరీర్ పీక్‌ను అందుకుంటున్నాడు. ఫిబ్రవరి 2026 వరకు అతడు 87 టీ20ఐ మ్యాచ్‌ల్లో సుమారు 2,574 పరుగులు సాధించాడు. అతడి సగటు 31.77, స్ట్రైక్ రేట్ 128.63.
ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి టోర్నీలో తొలి సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపై టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. అతడి ఖాతాలో ఇప్పటివరకు 2 టీ20ఐ సెంచరీలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కొనసాగుతున్న నిశాంక, శ్రీలంకను సూపర్-8 దశకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ నలుగురు ఓపెనర్లను పోలిస్తే, మొత్తం పరుగుల విషయంలో పాథుమ్ నిశాంక ముందున్నాడు. కానీ స్ట్రైక్ రేట్, దూకుడు బ్యాటింగ్, మ్యాచ్‌పై తక్షణ ప్రభావం విషయంలో అభిషేక్ శర్మ ముందంజలో ఉన్నాడు. అందుకే, ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే టీ20ఐల్లో అత్యుత్తమ ఓపెనర్‌గా అభిషేక్ శర్మను నంబర్-1గా పరిగణించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..