6,6,6,6,4,4,4,4,4.. అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న 27 మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 15 బంతుల్లోనే అద్భుతమైన అర్ధ శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

6,6,6,6,4,4,4,4,4.. అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Abhishek Sharma

Updated on: Apr 18, 2026 | 8:20 PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న 27 మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 15 బంతుల్లోనే అద్భుతమైన అర్ధ శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

పదిహేను బంతుల్లోనే పరుగుల సునామీ..

సొంతగడ్డపై హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఏ బౌలర్ వేసినా బంతిని మైదానం వెలుపలికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 15 బంతుల్లోనే తన అర్ధ శతకాన్ని పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ తో పవర్ ప్లే లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. బంతిని ఎదుర్కొన్న ప్రతిసారీ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఈ యువ ఎడమచేతి వాటం బ్యాటర్.. మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లు ఆడాడు.

చెన్నై బౌలర్లకు చుక్కలు..

చెన్నై సూపర్ కింగ్స్ ఎంత పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగినా, అభిషేక్ తుఫాను ముందు ఆ వ్యూహాలేవీ పనిచేయలేదు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందరినీ దారుణంగా శిక్షించాడు. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా కళ్లు చెదిరే కట్ షాట్లు, కవర్ డ్రైవ్ లు, భారీ సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. అతని బ్యాటింగ్ దాటికి ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక చెన్నై నాయకత్వం తలపట్టుకుంది. ప్రతి బంతినీ బౌండరీ లైన్ దాటించాలనే కసితో ఆడిన అభిషేక్, క్రీడాభిమానులకు అసలు సిసలైన టీట్వంటీ వినోదాన్ని పంచాడు. ఒక దశలో ప్రత్యర్థి బౌలర్లు బంతిని వేయడానికి సైతం భయపడేలా అతని ఆధిపత్యం కొనసాగింది.

ఐపీఎల్‌లో SRH తరపున అత్యంత వేగవంతమైన 50లు (బంతుల వారీగా):

15 – అభిషేక్ శర్మ vs చెన్నై, హైదరాబాద్, 2026

16 – అభిషేక్ శర్మ vs ముంబై, హైదరాబాద్, 2024

16 – ట్రావిస్ హెడ్ vs ఢిల్లీ, ఢిల్లీ, 2024

16 – ట్రావిస్ హెడ్ vs ఎల్‌ఎస్‌జీ, హైదరాబాద్, 2024

17 – హెన్రిచ్ క్లాసెన్ vs కేకేఆర్, ఢిల్లీ, 2025

అరుదైన రికార్డుల దిశగా అడుగులు..

15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కును అందుకోవడం ద్వారా ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల సరసన అభిషేక్ సగర్వంగా నిలిచాడు. ఈ యువ ఆటగాడి అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. గ్యాలరీల్లో కూర్చున్న ప్రేక్షకులు అతని ప్రతి షాట్‌ను ఉత్సాహంగా ఆస్వాదిస్తూ కేరింతలు కొట్టారు. ఒకవైపు పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్నా, విపరీతమైన ఒత్తిడి ఉండే ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో ఎలాంటి బెరుకూ లేకుండా ఇంతటి విధ్వంసం సృష్టించడం అతని అపారమైన ప్రతిభకు అద్దం పడుతోంది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే సన్‌రైజర్స్ జట్టుకు టైటిల్ దక్కడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్ తో టోర్నీలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా అభిషేక్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

Follow Us