వినాయక చవితి వస్తే చాలు.. ఊరూరా.. వాడ వాడలా వినాయక మండపాలు దండిగా దర్శనమిస్తాయి. తీరొక్క రూపాల్లో రంగు రంగుల వెలుగుల్లో అంతకు మించిన అలంకరణలతో డీజేలో మోతాల్లో కనిపిస్తాయి గణనాథుడి మండపాలు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.. ఒకే గ్రామం ఒకే మండపం ఒకే దేవుడు అన్నట్టుగా సమిష్టితత్వానికి గుర్తుగా.. ప్రకృతి పుత్రుడు కొలువుదీరుతాడు.
ఆ ఊరిలో ఐక్యమత్యమే మహా బలం అన్న నినదాన్ని అక్షర సత్యం చేస్తూ కోటోక్క పూజలనందుకుంటాడు గణనాథుడు. బ్రహ్మ ముహుర్తనా మొదలయ్యే పూజ నుండి అర్థరాత్రి వరకు అంగరంగ వైభవంగా కొనసాగే భజనలతో ఆహ్లాదాన్ని పంచుతూ కోరిన కోర్కెలు తీరుస్తాడు ఇక్కడి లంభోదరుడు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కర్రలో కొలువై దర్శనమిస్తూ.. అసలు నిమజ్జనమే ఎరుగక భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాడు. అంతటి మహిమ గల కర్ర గణనాథుని దర్శించుకోవాలనుందా.. ఛలో పాలజ్.. మహారాష్ట్ర – తెలంగాణ బోర్డర్. సరిహద్దు గ్రామాల్లో సంబురంగా సాగే కర్ర గణనాథుల చవితి పూజలు.
నిర్మల్ జిల్లా.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. పర్యావరణ హితుడైన పార్వతి పుత్రుడు కొలువుదీరిన గణనాథుల క్షేత్రం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులకు అసలు చోటే లేకుండా మట్టితోనూ సంబంధం లేకుండా కర్ర వినాయకులను ప్రతిష్టించి పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వాతంత్ర్య సిద్దించిన తొలినాళ్ళలో ఊపిరి పోసుకున్న పునికి కర్ర ఇదిగో ఇలా కర్ర గణనాథుడిగా 75 ఏళ్లుగా భక్తులకు దర్శిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పాలజ్, తానూర్ , చిక్లీ , బోని పేర్లేవైనా.. కర్ర గణనాథుల నిండైన రూపానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే మండపాలే.
ఏడాదికి కేవలం నవ రాత్రులు మాత్రమే ఈ గణనాథులు దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఈ కర్ర గణనాథులను దర్శించుకునేందుకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా.. దేశ నలుమూలల నుండి తండోపతండాలుగా భక్తులు తరలి రావడం ఇక్కడ ప్రత్యేకత. ఇక ఈ కర్ర గణపతులకు 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు కొనసాగుతుంటాయి. ఆ విశిష్ఠతలేంటో పాలజ్ కర్ర గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
మరాఠా కుగ్రామం.. గణనాథుని ఆశీర్వదంతో అభివృద్ది ఘనం
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠి కుగ్రామం పాలజ్. మహారాష్ట్రలోని బోకర్ తాలుకా పరిధిలో ఉన్న పాలజ్.. వినాయక చవితి వేడుకలు రావడమే ఆలస్యం ఇసుకేస్తే రాలనంత జనంతో భక్త జనజాతరగా దర్శనమిస్తుంది. కారణం ఇక్కడి కర్ర గణనాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి భక్త జనకోటి పాలజ్ కు క్యూ కట్టడమే. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తొలి నాళ్లలలో ఈ కర్ర గణనాథునికి ప్రాణప్రతిష్ఠ జరగగా.. 75 ఏళ్లుగా చక్కు చెదరకుండా భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు పాలజ్ గణపతి.
1948 లో తొలిసారి ఈ కర్రగణపతిని విగ్రహాన్ని ప్రతిష్టించారు పాలజ్ మండప నిర్వహకులు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలోనే వినాయక చవితి పండగ రావడంతో.. ఆ మహమ్మారి బారి నుండి రక్షించు గణపయ్యా అంటూ గ్రామంలో వినాయకుని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారంట పాలజ్ గ్రామస్తులు. అనుకున్నదే తడువుగా విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారంట.
మట్టితో చేసిన గణనాథుడిని కాకుండా కర్రతో గణపతిని చేయించాలని సంకల్పించి.. నిర్మల్ కు చెందిన పాలకొండ గుండాజీ వర్మను సంప్రదించి కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయాలని కోరారంట. నిష్ఠతో కర్ర గణపతిని చెక్కిన గుండాజీ అనుకున్న సమయానికంటే ముందే నిర్వహకులు గణనాథుని విగ్రహాన్ని అందించడం.. పాలజ్ వాసులు ఓ చిన్న కుటీరంలో ప్రతిష్టించి నవరాత్రులు భక్తి శ్రద్దలతో పూజించడం జరిగింది. దాంతో వెంటనే ఆ ఏడాది అంటువ్యాధులు పూర్తిగా మటుమాయం కావడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారట.
దీంతో ఆ కర్ర గణపతిని నిమజ్జనం చేయకుండా జాగ్రత్తగా భద్రపరిచి.. మళ్లీ వినాయక చవితికి బయటకు తీసి పూజలు నిర్వహించారంట. అలా ఏడాదికి ఏడాది గణనాథుడి ఆశీర్వాదంతో గ్రామం అభివృద్ది వైపు పరుగులు తీయడం.. కుగ్రామం కాస్త పట్టణంగా మారడం.. కర్ర గణపయ్య కొలువుదీరిన కుటీరం కాస్త ఆలయంగా అభివృద్ది చెందడం జరిగింది. 75 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని పాలజ్ గ్రామస్తులు చెప్తున్నారు.
ఇక్కడి ప్రత్యేకతే ఈ కుగ్రామానికి ప్రతిఏటా లక్షలాది మందిని రప్పిస్తోంది. ఎక్కడా లేని విధంగా వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి.. పూజించడమే ఈ పాలజ్ గ్రామ ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరిన కర్ర గణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… పాలజ్ గ్రామంలో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు.
కర్రతో చేసిందైనా.. నకాషీ కళాకారుడైన గుండాజీవర్మ చేతుల్లో సుందరంగా రూపుదిద్దుకున్నాడు ఇక్కడి లంబోదరుడు. అసలు.. కర్రతో ఇంత అందంగా విగ్రహాన్ని మలచవచ్చా.. అనేంత నునుపుగా గణపయ్యను తీర్చిదిద్దాడు. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగు చేతుల వాడిగా.. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరోచేతిలో త్రిశూలం, ఇంకోచేతిలో లడ్డులతోపాటు కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటాడు.
ఇక్కడి చేరుకోవాలంటే రైళ్ళు , రోడ్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసరల మీదుగా రైలులో ప్రయాణించి భైంసా చేరుకుంటే దూర భారం తగ్గుతుంది. రోడ్డు మార్గం ద్వారా వచ్చే వారు , నిజామాబాద్ , బాసర మీదుగా బైంసా చేరుకోవచ్చు. లేదా నిర్మల్ మీదుగా భైంసా చేరుకుని ఇక్కడి నుండి 23 కిలో మీటర్లు ప్రయాణిస్తే పాలజ్ గ్రామానికి చేరుకోవచ్చు. పాలజ్ ను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్ర సరిహద్దులోని భైంసా డివిజన్ లో వెలిసిన కర్ర గణనాథులనుసైతం దర్శించుకోవచ్చు.
తొలిపూజలు అందుకునే ఆది దేవుడిగా, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా, సర్వశుభాలను కలిగించే శివతనయుడిగా… భక్తుల కొంగు బంగారంగా నిలిచిన పాలజ్ గణనాథుడి స్పూర్తితో తాము కూడా కర్ర గణనాథుడి ప్రతిష్టించుకోవాలని సంకల్పించిన పాలజ్ సరిహద్దు గ్రామాలైన తెలంగాణలోని పల్లెలు సైతం పాలజ్ బాటలోనే కర్ర గణపయ్య ను ప్రతిష్టించారు.
1968 లో ఊపిరి పోసుకున్న ఆ సంకల్పం ఇదిగో ఇలా నిర్మల్ జిల్లాలోని మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బైంసా డివిజన్ లో 50 ఏళ్లుగా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక దేవాలయం స్పూర్తితో తానూరు మండలం భోసి గ్రామస్తులు సైతం కర్ర గణపతికే జై కొట్టడంతో.. 1963లో మొదటిసారి కర్రతో తయారు చేయించిన వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు.
ఒకే గ్రామం ఒకే రూపం ఒకే మండపం అన్న నినాదంతో ఐక్యమత్యాన్ని ప్రతిబింబించేలా.. భోసి లోని గ్రామస్తులు కర్ర గణనాథున్ని ప్రతిష్టించారు. ఈ గణనాథునికి ప్రాణం పోసింది కూడా నిర్మల్‌కు చెందిన కళాకారుడు గుండాజీ వర్మనే కావడం విశేషం. వినాయక చవితి వచ్చిందంటే బోసి గ్రామమంతా పండుగ వాతవరణంలా కనిపిస్తుంది. గణపతి దీక్షల ను స్వీకరించడం ఈ గ్రామస్తుల ఆనవాయితీ. కానీపాకంలోని వినాయకుడు శ్రీ వరసిద్ధిగా వినాయకుడి దర్శనం ఇస్తే గణేషుని నవరాత్రుల్లో భోసి గ్రామంలో కర్ర గణపతిని దర్శించుకుంటే కానీపాకం వినాయకున్ని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని భక్తులు భావిస్తారు. ముడుపు కడితే ఏడాది తిరిగే సరికి తాము కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. భోసి గ్రామ పెద్దలు తేదీ 31-08-1963 (భద్రపద శుద్ద చతుర్తి) వినాయక చవితి రోజున తొలి పూజలందుకు ఇక్కడి కర్ర నాధుడు ఇప్పటికి ప్రతి ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు దర్శన మిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తుంటాడు.
పాలజ్ , భోసి గ్రామాలే కాదు.. చిక్లీ గ్రామంలోను ఇదే తీరున కర్ర గణనాథుడు దర్శనమిస్తుంటాడు. భోసిలో కర్ర వినాయకున్ని ప్రతిష్టించినప్పటి నుంచి గ్రామాభివృద్దితో పాటు గ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు సాదించారని.. అదంతా ఆ బొజ్జ గణపయ్య ఆశీర్వాద ఫలితమే అంటున్నారు భోసి వాసులు. భోసిలో ఏకంగా 450 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారంటే ఆ విద్యాప్రదాత గణపయ్య ఆశీర్వాదం ఈ గ్రామం మీద ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వినాయక నవరాత్రులు ఒక ఎత్తైతే.. శోభయాత్ర మరో ఎత్తు. దేశమంతటా.. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా డీజే మోతలతో డ్యాన్సులతో యువత హంగామా తారస్థాయిలో కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడి కర్ర గణనాథుల నిమజ్జన్నం మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల విశేష పూజల తర్వాత పాలజ్, తానూర్ , చిక్లీ , బోని గ్రామాలలో కొలువుదీరిన కర్ర లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. ఈ మూడు గ్రామాల్లో కొలువు దీరిన కర్ర గణనాథులకు అన్ని గణనాథుల వలే నిమజ్జనం మాత్రం ఉండదు.. 11 వ రోజు కర్ర గణనాథుడిని రథంపై ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించడం.. అనంతరం మహాదేవుని విగ్రహం పై నీళ్లు చల్లి భద్రపరచడం ఆనవాయితీ.
ఈ శోభయాత్ర వేళ హరి కీర్తనలు , భజనలు తప్ప డీజే మోతలు అస్సలు కనిపించవు. సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలాగా ఇక్కడి నిమజ్జన ఊరేగింపు కనువిందు చేస్తుంటుంది. ప్రతి రోజూ బ్రహ్మ ముహుర్తాన స్వామి వారి కాకడ హారతి, మధ్యాహ్నం గీత ప్రవచనం, రాత్రి కీర్తనలు, జాగరణలు, భజనలతో కోలాహలంగా కనిపిస్తాయి కర్ర గణనాథుడి కొలువైన ఈ మూడు గ్రామాల మండపాలు. ఈఏడాది కూడా ముచ్చటగా కొలువుదీరి మూడు జగాలను ఆశీర్వదిస్తూ ముక్కోటి పూజలందుకుంటున్నాడు కర్ర గణనాథుడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..