స్వామియే శరణం అయ్యప్ప..! శబరిమల భక్తులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్..
శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సోమవారం ఉదయం 5గంటలకే మండల-మకర విళక్కు యాత్ర కోసం ఆలయ తలుపులు తెరిచారు. రోజువారీ క్రతువులు రేపు మొదలవుతాయి. మండల పూజ తర్వాత డిసెంబర్ 27 రాత్రి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, డిసెంబరు 30న మకర విళక్కు కోసం మళ్లీ తెరుస్తారు.

శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సోమవారం ఉదయం 5గంటలకే మండల-మకర విళక్కు యాత్ర కోసం ఆలయ తలుపులు తెరిచారు. రోజువారీ క్రతువులు రేపు మొదలవుతాయి. మండల పూజ తర్వాత డిసెంబర్ 27 రాత్రి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, డిసెంబరు 30న మకర విళక్కు కోసం మళ్లీ తెరుస్తారు. 2027 జనవరి 14న మకర జ్యోతి ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. దాంతో 2 నెలల యాత్రా కాలం ముగుస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా, సజావుగా యాత్ర పూర్తయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రద్దీ నియంత్రణపై దృష్టి పెట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు అదనపు డీజీపీ విజయన్. శబరిమల ఆలయాన్ని చేరుకునేందుకు భక్తులు ఉపయోగించే ఎరుమేలి-కననపాథ అటవీ మార్గంలో అత్యవసర సేవలందించే పోలీస్, పంచాయతీరాజ్ విభాగాల సిబ్బందికి ఆహార సదుపాయాలు కల్పించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. కాగా.. 41 రోజుల మండల యాత్ర నవంబర్ 17న ప్రారంభమవుతుంది.
చర్లపల్లి, కొల్లాం.. స్పెషల్ ట్రైన్స్..
ఇదిలాఉంటే.. శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం కోసం చర్లపల్లి – కొల్లం – చర్లపల్లి మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (07180 / 07181) నడపాలని నిర్ణయించింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు మొత్తం 12 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
చర్లపల్లి – కొల్లాం ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (07180) : 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి శుక్రవారం) రాత్రి 11:45 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం బయలు దేరిన తర్వాత ఆదివారం ఉదయం 7:55 గంటలకు కొల్లాం జంక్షన్‌కు చేరుకుంటుంది.
కొల్లాం – చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (07181): నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి ఆదివారం) ఉదయం 10:40 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి.. మరుసటి రోజు అంటే సోమవారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.
ఇంటికే పోస్టాఫీసు ద్వారా శబరిమల ప్రసాదం!
శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవసొం బోర్డు (TDB), ఇండియా పోస్ట్ సంయుక్తంగా ఒక సులభమైన సేవను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇకపై భక్తులు శబరిమల ప్రసాదాన్ని నేరుగా తమ ఇళ్లకు పార్శిల్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఈ మేరకు శబరిమల పర్వత ప్రాంతంలోనే 24 గంటలూ పనిచేసే ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కౌంటర్‌ను ఇండియా పోస్ట్ ఏర్పాటు చేస్తోంది. ఈ సేవ ద్వారా అయ్యప్ప భక్తులు ప్రసిద్ధమైన అరవణ పాయసం (Aravana Payasam), అప్పం తదితర పవిత్ర ప్రసాదాలను నేరుగా పోస్ట్ ద్వారా తమ ఇళ్లకు పంపించుకునే అవకాశం లభిస్తుంది. దీవనల కోసం నేరుగా రాలేకపోయినా లేదా ప్రసాదాన్ని తమ బంధుమిత్రులకు పంపాలనుకునే భక్తులకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.
