Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?
Namakkal Anjaneya Swamy: తమిళనాడులోని నామక్కల్ జిల్లా కేంద్రంలో, నామక్కల్ కొండ దిగువన ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆంజనేయ స్వామి ఆలయం వెలసి ఉంది. ఇక్కడ హనుమంతుడు నిలువెత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. దాదాపు 20 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహం ఆలయ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ హనుమంతుడు రోజు రోజుకూ పెరుగుతుండటం విశేషం.

రామభక్త హనుమాన్ ఎందరికో ఆరాధ్య దైవం. ఒక్క హనుమంతుని పూజిస్తే సీతారామలక్ష్మణులు, పరమశివుడు, శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. అందుకే ఆంజనేయస్వామి ఆలయం లేని ఊరు ఉండదు. దేశంలో అనేక ప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన విశిష్టత కలిగిన క్షేత్రంగా తమిళనాడు నామక్కల్ హనుమాన్ ఆలయం నిలుస్తుంది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా కేంద్రంలో, నామక్కల్ కొండ దిగువన ఈ ఆంజనేయ స్వామి ఆలయం వెలసి ఉంది. ఇక్కడ హనుమంతుడు నిలువెత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. దాదాపు 20 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహం ఆలయ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
స్థల పురాణం
హిరణ్యకశ్యపుని సంహారం అనంతరం నరసింహ స్వామి ఈ ప్రాంతంలో హనుమంతునికి దర్శనమిచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగా లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. నామక్కల్‌లో హనుమంతుడు స్వయంభువుగా వెలసినట్లు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.
పైకప్పు లేని ఆలయం.. రోజురోజుకీ పెరుగుతున్న హనుమ
నామక్కల్ హనుమాన్ ఆలయానికి పైకప్పు లేకపోవడం ఒక విశేషం. గతంలో పైకప్పు నిర్మించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెబుతారు. అంతేకాదు, ఇక్కడి హనుమాన్ విగ్రహం రోజురోజుకీ పెరుగుతున్నట్లు ఆలయ అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. అందువల్ల ఆలయానికి పైకప్పు వేయడం సాధ్యం కాదనే నమ్మకం ఉంది. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కూడా పైకప్పు లేకపోవడం మరో విశేషం.
ఆలయ చరిత్ర
సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం నామక్కల్ కోట దిగువ భాగంలో ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్ల దూరంలో హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయుడు చేతులు జోడించి లక్ష్మీ నృసింహ స్వామి వైపు నమస్కరిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఈ రూపమే నామక్కల్ హనుమాన్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
ఇతర ఆలయ విశేషాలు
16వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించిన నామగిరి కోటకు ఇరువైపులా నరసింహ స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. కొండరాయితో చెక్కబడిన ఈ విగ్రహాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. కొండలలో ఉన్న ఎనిమిది కొలనుల్లో అన్ని కాలాల్లోనూ తామర పువ్వులు వికసిస్తూ ఉండటం మరో విశేషం.
పూజలు – ఉత్సవాలు
నామక్కల్ హనుమాన్ ఆలయంలో రోజుకు నాలుగు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు కలసంధి, మధ్యాహ్నం 12 గంటలకు ఉచికాల పూజ, సాయంత్రం 6 గంటలకు సాయరక్ష, రాత్రి 8:45 గంటలకు అర్ధజామ పూజ నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ప్రతి నెల హనుమంతుని జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆలయం దర్శన ఫలం
చెడు అలవాట్లు, వ్యసనాలు, మానసిక బలహీనతలతో బాధపడేవారు నామక్కల్ హనుమ దర్శిస్తే ఉపశమనం లభిస్తుందనే నమ్మకం ఉంది. ఎంతటి దుర్వ్యసనాల నుంచైనా బయటపడే శక్తిని ఈ హనుమంతుడు ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
ఎలా చేరుకోవాలి..?
నామక్కల్ జిల్లా కేంద్రం నుంచి సేలం వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నామక్కల్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని, హనుమంతుని అనుగ్రహంతో కార్యసిద్ధి, శత్రుజయం పొందండి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
