Vijayawada: ఇంటి వద్దకే విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం.. కేవలం రూ.118కే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. ఇంటి వద్దకే మీరు అమ్మవారి ప్రసాదం పొందవచ్చు. ఈ మేరకు ప్రసాదం కిట్‌ను ఆలయ అధికారులు ప్రత్యేకంగా రూపొందించారు. దీని ద్వారా ఇంటి వద్దనే అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు. దసరా సందర్బంగా ఈ సదుపాయం తీసుకొచ్చారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులకు పొటెత్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా రోజున భక్తుల రద్దీ మరింత పెరగనుంది. అయితే అధిక రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లలేని భక్తుల కోసం పోస్టల్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి ప్రసాదాన్ని ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. పోస్టాఫీస్ ద్వారా ప్రసాదం కిట్‌ను ఆర్డర్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే పంపించనుంది. దసరా సందర్భంగా భక్తుల కోసం పోస్టల్ శాఖ ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించింది.
ప్రసాదం కిట్ ధర ఎంతంటే..?
ఒక్కొ ప్రసాదం కిట్ ధర రూ.116గా ఉంది. ఈ కిట్‌లో మొత్తం 6 రకాల వస్తువులు ఉంటాయి. అమ్మవారి లాకెట్, అక్షింతలు, రెండు శక్తి కంకణాలు, కుంకుమ, శ్రీ కనకదుర్గ ప్రభ పుస్తకం, 50 గ్రాముల పంచకజ్జాయ ప్రసాదం వంటి ఉంటాయి. ఆలయానికి వెళ్లలేవారు దీని ద్వారా ఇంటి వద్దనే అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు. ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లే ప్రసాదం కిట్‌ను బుక్ చేసుకోవాలి. అనంతరం మీ అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. ఏపీలోని ప్రజలకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని భక్తులకు ఈ సౌకర్యం లేదు. పోస్టల్ శాఖ ద్వారా అందించేందుకు దాదాపు లక్ష కిట్లను ఆలయ అధికారులు రెడీ చేశారు. మహా మండపం ఆరో అంతస్తులో ప్యాకింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని అందించేందుకు త్వరగా పాడవ్వని వస్తువులను కిట్‌లో చేర్చారు. లడ్డూలు, త్వరగా పాడయ్యే వస్తువులను కిట్‌లో చేర్చడం లేదు. దీంతో డెలివరీ ఆలస్యం జరిగినా భక్తులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పండుగ సందర్భంగా ఆలయానికి రాలేనివారు పోస్టల్ శాఖ ద్వారా అమ్మవారి ప్రసాదం పొంది ఆశీస్సులు పొందవచ్చు. కనకదుర్గమ్మ భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
భక్తులకు ఉచిత దర్శనం
అటు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం అందించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని క్యూలైన్లలో భక్తులకు ఉచిత దర్శన అవకాశం కల్పిస్తున్నారు. దర్శన టికెట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. దీని వల్ల ఎక్కువమంది భక్తులకు వీలైనంత త్వరగా అమ్మవారికి దర్శనం కల్పించవచ్చు. రద్దీని నియంత్రించేందుకు, దర్శనాల్లో వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీవీఐపీ భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను ప్రవేశపెట్టారు.
